మునుగోడులో ఉపఎన్నిక వస్తే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తారన్న కారణంగానే రాజీనామా చేశానని.. ప్రజలకు న్యాయం చేసేందుకేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకున్నారు. ఇలా చెప్పుకోవడానికి కారణం టీఆర్ఎస్సే. ఎక్కడ ఉపఎన్నిక జరిగితే అక్కడ వందలకోట్ల నిధులు పారించడం టీఆర్ెస్ సర్కార్కు అలవాటు. దుబ్బాక నుంచి హుజూర్ నగర్ వరకూ జరిగింది అదే. హుజూర్ నగర్లో అయితే.. ప్రతి దళిత కుటుంబం ఇంటికి పది లక్షలు పంపిణీ చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
అయితే హుజురాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా చేసిన ఖర్చు.. టీఆర్ఎస్ అనధికారికంగా చేసిన ఖర్చు చూసిన వాళ్లంతా తమ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు వస్తే బాగుండని అనుకున్నారు. కొన్ని చోట్ల ప్రజలు ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు అదే కారణం చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిరాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజీనామా చేస్తారని తెలియగానే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఎప్పట్లాగే కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం.. సీఎంఆర్ఎఫ్ వంటి వాటిని విడుదల చేయడం చేస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్ని ఆమోదిస్తున్నారు.
ఈ జోరు ఇలా కొనసాగితే.. మునుగోడులో గెలుపు కోసం కూడా టీఆర్ఎస్ డబ్బులపైనే ప్రధానంగా ఆధారపడినట్లవుతుంది. అదే జరిగితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ పట్టించుకోని వారు ఇప్పుడు ఉపఎన్నికలు వచ్చే సరికి వెంట పడుతున్నారని భావిస్తారు. అది పూర్తిగా మైనస్ అవుతుంది. అందుకే ఈ సారి టీఆర్ఎస్ .. ఉపఎన్నిక విషయంలో భిన్నమైన వ్యూహాన్ని అవలంభించాల్సి ఉంటుంది.