రేవంత్ రెడ్డిని బూచిగా చూపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి “మీరు” అన్నారంటూ రచ్చ ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. నిజానికి కోమటిరెడ్డి బీజేపీలో చేరికపై చాలా సార్లు ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో చర్చలు జరిగి.. ఇప్పటికి ఫలితం వచ్చినట్లుగా భావిస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసే రాజకీయాలు చేస్తూంటారు. ముఖ్యంగా అన్న సలహాలు లేకుండా రాజగోపాల్ రెడ్డి ఏమీ చేయరని కాంగ్రెస్‌లోనే చాలా మందికి తెలుసు.
అయితే కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని చాలా చిన్న స్థాయి నుంచి వేల కోట్లకు అధిపతులుగా ఎదిగిన రెడ్డి సోదరులు ఇప్పుడు కాంగ్రెస్ ను ముంచేస్తే విమర్శలు వస్తాయని కారణం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రేవంత్ రెడ్డి కనిపించినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి.. ఆయన వల్లే తాను పార్టీని వీడుతున్నామని తమకు అవమానం కలుగుతోందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సోదరుడ్ని పల్లెత్తు మాట అనకుండా.. వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిపై రివర్స్ అయ్యారు.
వెంకటరెడ్డి వ్యూహం కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి.. కాంగ్రెస్ పార్టీని వీలైనంతగా బద్నాం చేసి పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ తర్వాత కూడా జగ్గారెడ్డి .. వీహెచ్ లాంటి వాళ్లను రేసులోకి తీసుకొస్తారని.. కాంగ్రెస్ పార్టీలో నేతలే.. సొంత పార్టీపై కుట్రలు చేస్తున్నారని.. ఇక ఆ పార్టీకి భవిష్యత్ ఎలా ఉంటుందని కార్యకర్తలు నిరాశపడుతున్నారు. రేవంత్ ను బూచిగా చూపి కాంగ్రెస్‌పై పై స్థాయిలో కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా.. కోమటిరెడ్డి కాంగ్రెస్‌లో ఇక ఇమడటం కష్టమేనని భావిస్తున్నారు.