అమరావతిని కాదని మరో రాజధాని సాధ్యం కాదని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అమరావతిలో వారం రోజుల పాటు నిర్వహించిన మనం..మన అమరావతి పాదాయత్ర ముగింపు కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సహా ఏపీ ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యంగా రాజధాని కోసం గట్టిగా నిలబడిన సుజనా చౌదరి, కన్నా లక్ష్మినారాయణ వంటి వారు ఈ సభలో యాక్టివ్‌గా కనిపించారు.
వారంతా రాజధాని రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరస్థితుల్లోనూ రాజధాని మారదన్నారు. జగన్ చేసిన అతి పెద్ద తప్పు రాజధాని రైతులకు అన్యాయం చేయడమని ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారడం అభివృద్ధికి చేటని తెలియని సీఎం ఉండటం దురదృష్టకరమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మూడు రాజధానులను వైసీపీ వారూ వ్యతిరేకిస్తున్నారన్నారvf కేవలం స్టేజ్‌పైనే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
వారం రోజుల పాటు బీజేపీ నేతల పాదయాత్ర రాజధాని గ్రామాల గుండా సాగింది. అయితే ఈ పాదయాత్రలో సోము వీర్రాజు లీడ్ తీసుకోవడంతో రైతుల్లో అనుకున్నంత స్పందన కనిపించలేదు. పైగా విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీకి పాదయాత్ర మైలేజ్ రాకుండా పోయింది. అయితే కొంత మంది బీజేపీ నేతలు చేసిన వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని సుజనా చౌదరి అమరావతి రైతుల్ని కోరారు. అయితే ముగింపుసభకు మాత్రం అమరావతికి మద్దతుగా నిలబడిన నేతల్ని తీసుకు రావడతో బీజేపీ సభలో కాస్త ఉత్సాహం కనిపించింది.