తనకు కుప్పం ఎంతో పులివెందుల అంత అంటూ చంద్రబాబు మాటలు బాగా చెప్పేవారు. మాటలతో పాటు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. చంద్రబాబు ఉన్న సమయంలో పులివెందులకు అనధికారిక ఎమ్మెల్యేగా సతీష్ రెడ్డి వ్యవహరిస్తూ.. పనులు చేశారు. గడ్డాలు పెంచుకుని మరీ గండికోట ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత తీశారు. ఇలా చాలా చేశారు. కానీ ఎన్నికల రాజకీయాల్లో జగన్ మెజార్టీని తగ్గించలేకపోయారు. కానీ ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు. తనకు పులివెందుల ఎంతో కుప్పం కూడా అంతే అంటున్నారు.
నియోజకవర్గం నుంచి యాభై మంది కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడే కార్యక్రమాన్ని జగన్ గురువారం ప్రారంభించారు. మొదట కుప్పంతోనే ప్రారంభించారు . కార్యకర్తలంటే.. దిగువ స్థాయి వారు కాదు. స్థానిక సంస్థల్లో గెలిచిన వారిని ఎంపిక చేసి తీసుకొచ్చారు. వారిలో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లందరితో మాట్లాడిన జగన్.. కుప్పం అభ్యర్థి భరతేనని చెప్పుకొచ్చారు. కుప్పంలో బోలెడంత అభివృద్ధి చేస్తున్నామని.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే బిల్డింగ్ల గురించి చెప్పారు. ఇతర అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తున్నామని.. రెండు రోజుల్లో జీవోలిస్తామని చెప్పారు.
అయితే తనకు కుప్పం లాంటిదే అని చెప్పుకున్న పులివెందులకు రూ. వేల కోట్ల జీవోలిచ్చారు కానీ నిధులు విడుదల చేయలేదు. కుప్పంకు ఇప్పుడు జీవోలిస్తామంటున్నారు ఎప్పుడు నిధులిస్తారో తెలియదు. కానీ తనకూ పులివెందుల లాంటిదే కుప్పం అని చెప్పడంతో అందరికీ గతంలో చంద్రబాబు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. తనకు కుప్పం లాంటిదే పులివెందుల అని ఆయన అక్కడ ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ చేసిందేమీ లేదు. జగన్ కూడా అదే చేస్తున్నారు. మరేం చేస్తారో ?