తెలంగాణలో ఉపఎన్నికలు టీఆర్ఎస్కు ఇష్టం లేదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నికలకు వెళ్లాలని అనుకుంటే రాజీనామా చేయాలనుకున్న రాజగోపాల్ రెడ్డి తక్షణం లేఖ ఇవ్వాలని తమ పార్టీ నేతల ప్రకటనల ద్వారా ఒత్తిడి తెచ్చేవారు. మీడియాలో హోరెత్తించేవారు. ఆయన ఎప్పుడు లేఖ ఇస్తారో అప్పుడు తీసుకోవడానికి వెంటనే ఆమోదించి గెజిట్ విడుదల చేయడానికి సకలం సిద్ధంగా ఉంటుంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఇదే జరిగింది. ఎందుకంటే ఆ ఉపఎన్నికల్లో కేసీఆర్ బలంగా కోరుకున్నారు. గెలిచి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌ను సమాధి చేయాలనుకున్నారు. కానీ జరిగింది వేరే. అది తర్వాతి విషయం.
ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఉపఎన్నిక తెస్తానంటే మాత్రం టీఆర్ఎస్లో అంత ఉత్సాహం కనిపించడం లేదు. దమ్ముంటే తక్షణం స్పీకర్‌ను రాజీనామా లేఖ ఇవ్వాలని ఎవరూ డిమాండ్ చేయడం లేదు. టీఆర్ఎస్ పత్రికల్లోనూ అలాంటి సవాళ్లు కనిపించడం లేదు. అంతేనా .. స్పీకర్ సమయాన్ని అడిగితే.. నాలుగైదు రోజుల తర్వాత కేటాయించారు., అంటే.. రాజీనామా విషయంలో అంత త్వరగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని చెప్పవచ్చు. స్పీకర్ రాజీనామా లేఖ తీసుకోవడానికే నాలుగు రోజుల వరకూ సమయం తీసుకున్నారంటే ఆమోదానికి మరికొంత సమయం పట్టొచ్చు. అది స్పీకర్ ఇష్టం.
ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధమైతే రాజీనామాను అంగీకరిస్తారు. లేకపోతే వీలైనంత ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టే చాన్స్ ఉంది. అయితే ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతున్నారన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్‌కు ఇబ్బందే. అందుకే ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి రాజకీయ చాణక్యం చూపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.