బీజేపీ అంటే బాబు జనతా పార్టీ అని వైసీపీ కొత్తగా అర్థాలు చెబుతోంది. కొద్ది రోజులుగా బీజేపీపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు తాజాగా అమరావతి విషయంలో మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీని “బాబు జనతా పార్టీ”గా మార్చారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వివరిచారు. రాజధానిలో బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టి బహిరంగసభ నిర్వహించారు. రాజధానిని తరలించే ప్రయత్నం చేసిన వైఎస్ఆర్సీపీపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు.
ఈ అంశంపై మీడియా సమావేశం పెట్టిన గడికోట శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తే.. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతో మాట్లాడుతున్నారని.. టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో సుజనా చౌదరి , సీఎం రమేష్‌కి… సత్యకుమార్ ఎప్పుడూ కొమ్ము కాస్తూన్నారని విమర్శించారు. అమరావతి రాజధాని కదలదని బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను శ్రీకాంత్ రెడ్డి ఖండించారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామననారు. బీజేపీపై వైసీపీ నేతల విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీని కించపరిచేలా బాబు జనతా పార్టీ అంటూ మాట్లాడటంపై .. బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. బీజేపీతో దూరం జరుగుతున్నట్లుగా నటిస్తున్నారా లేకపోతే.. నిజంగానే బీజేపీకి దూరం జరగాలని అనుకుంటున్నారా అన్నదానిపై రాజకీయవర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.