మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని వైసీపీ పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఈ మేరకు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. రాజధానిపై రాష్ట్రానికి సర్వాధికారాలు ఉండాలని ఈ మేరకు ఆర్టికల్ త్రీని సవరించాలని ఆయన బిల్లులోని సారాంశం. అది ప్రైవేటు బిల్లే కానీ… అలాంటి బిల్లును పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ పూర్తిగా ఇరుక్కుపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితికి చేరిపోయింది.
చట్ట ప్రకారం ఇక మూడురాజధానులు చేయలేరు. అమరావతిని నిర్మించి తీరాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. వచ్చే నెలలో సవాల్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడా అనుకూల తీర్పు వస్తుందని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు రాజ్యాంగసవరణ కు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనేదే లేదని జగన్ చాలా సార్లు చెప్పారు. అయినా ఇప్పుడు ఆర్టికల్ త్రీలో సవరణ కోసం వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.
సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు.. అని జగన్ చెబుతున్నారు. అందుకే ఆయన విశాఖ వెళ్లిపోవాలని రిషికొండ దగ్గర క్యాంప్ ఆఫీస్‌ను… రెడీ చేయించుకుంటున్నారు. దానిపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. అయినా వెనక్కి తగ్గట్లేదు. స్టార్ హోటల్ పేరుతో ..కడుతున్నారు కానీ అలాంటి సౌకర్యాలతో కాకుండా ఇంటి మాదిరిగా ప్లాన్ తీసుకోవడంతో అసలు విషయం బయటపడుతుంది. ఇలా ఒకదానికి కొకదానికి పొంతన లేకుండా రాజధాని విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయం.. గందరగోళంగా మారిపోయింది.