పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీర మహిళలతో ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాలను అభినందించిన పవన్ కళ్యాణ్ , తమ పోరాట పటిమ ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. అయితే అదే సమయంలో వారికి సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఇటీవల కాలంలో బాగా చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవతలి వైపు ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా, అంతకంటే పెద్ద నేతలైనా భయపడకుండా వారి అనుచరులు చేస్తున్న ఆగడాలను సోషల్ మీడియా వేదికగా బయట పెడుతోంది. అయితే ఇటీవల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో వీర మహిళల వాగ్వివాదం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరదల సందర్భంగా వీర మహిళలు కొందరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. తమ నియోజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలు, పవన్ కళ్యాణ్ పట్ల స్థానికంగా ఉన్న అభిమానం దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ వీర మహిళలతో ఓపిగ్గా సంభాషించారు. వారిచ్చిన వినతిపత్రం తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ, వీర మహిళల లో కొందరు, పార్టీ పెద్దల దృష్టిలో పడాలని ఉద్దేశంతోనో మరేమో కానీ హఠాత్తుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దూకుడుగా నినాదాలు చేసి అప్పటిదాకా ఉన్న వాతావరణం పూర్తిగా మార్చి వేశారు. దీంతో జక్కంపూడి రాజా కూడా సహనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అనూహ్యంగా ఇవాళ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీర మహిళలతో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఇతర అధికార పార్టీ నాయకులు కానీ సరైన రీతిలో స్పందించకపోతే కచ్చితంగా మీ దూకుడు కొనసాగించమని వారిని కోరుతూనే, అవతలి నాయకులు సముచితమైన రీతిలో స్పందించినప్పుడు అనవసరంగా వివాదాన్ని చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని వారిని సున్నితంగా మందలించారని విశ్వసనీయ సమాచారం.
ఏది ఏమైనా అవతలి పార్టీ నాయకులు ఏది చేసినా తప్పు అని చెప్పే పరిస్థితి తన పార్టీకి అవసరం లేదని, అలా చేస్తే తమ పార్టీకి మిగతా పార్టీలకు తేడా ఉండదని, ప్రజల్లో వీర మహిళల పట్ల జనసేన పార్టీ పట్ల సదభిప్రాయం మరింత పెరిగే విధంగా కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు వీర మహిళలు ఎంతవరకు ఆచరణలో పెడతారు అన్నది వేచి చూడాలి.