” మునుగోడు ఉపఎన్నిక చిన్నదే. దాని వల్ల వచ్చేదేం ఉండదు.. పోయేదేం ఉండదు ” అని మంత్రి కేటీఆర్ ఇటీవల నెటిజన్లతో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయలోనూ ఆయన ఇదే చెప్పారు. ఆశల్లేకపోతేనే ఆయన ఇలా చెబుతారన్న అభిప్రాయం ఈ కారణంగానే బలపడుతోంది. మునుగోడులో టీఆర్ఎస్కు అవకాశాలు ఉన్నా లేకపోయినా.. ఆ పార్టీ రాజకీయ వ్యూహం మాత్రం భిన్నంగా ఉంటుందన్న చర్చలు సాగుతున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వంపై అధికార వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఓట్లు ఏకపక్షంగా ఎవరికైనా పడితే టీఆర్ఎస్కు ఇబ్బంది. చీలిపోతే ఏకపక్షంగా మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇది రాజకీయ పండితులు చెప్పే మాట. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికతో తాము గెలవకపోయినా… గెలిచే మార్గం టీఆర్ఎస్ ఎదుట కనిపిస్తోంది. అదే ఓట్ల చీలిక. మునుగోడులో సంప్రదాయంగా బీజేపీకి.. టీఆర్ఎస్కు బలం లేదు. అది కమ్యూనిస్టులు.. కాంగ్రెస్‌ల పోరుబరి. ఇప్పుడు కోమటిరెడ్డి కారణంగా బీజేపీ వస్తోంది.
కోమటిరెడ్డికి ఉన్న ఇమేజ్ ప్రకారం చూసినా.. కాంగ్రెస్ క్యాడర్ ఆయన వెంట తక్కువ మంది వెళ్లడం వంటి పరిణామాలు చూసినా .. మునుగోడు బీజేపీకి పెనుసవాలే. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి మెరుగు. తెలంగాణ అధికార పార్టీగా టీఆర్ఎస్కు అడ్వాంటేజ్. ఇలాంటి సమయంలో రాజకీయ వ్యూహాన్ని మార్చి.. పోరును కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య పరిమితం చేస్తే బీజేపీ లాసైపోతుంది. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయ సెంటిమెంట్ మారుతుంది. ఒక వేళ మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్కు పెద్ద గండం పొంచి ఉంటుంది.
అందుకే కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో తన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ను ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ కు కూడా ఎంతో మేలు చేసినట్లవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడూ తామే లాభం పొందాలనుకోలేరు.. ఎదుటి పార్టీకి మేలు చేయడం ద్వారా కూడా తాము లాభపడతారు. ఇలాంటి రాజకీయాల్లో కేసీఆర్ ఆరి తేరిపోయారు. అందుకే ఆయన నిర్ణయాలపై ఆసక్తి ఏర్పడుతోంది.