ఆకు వెళ్లి ముల్లు మీద పడినా.. ముల్లు వెళ్లి ఆకు మీద పడినా .. బొక్క ఆకుకే. ఈ సామెతను రాజకీయాలకు అన్వయిస్తే.. ప్రాంతీయ పార్టీలు వెళ్లి బీజేపీతో పెట్టుకున్నా.. మళ్లీ బీజేపీని వదిలేసినా… బొక్క ప్రాంతీయ పార్టీలకే. ఇది చాలా రోజులుగా కళ్ల ఎదురుగా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు జేడీయూ వంతు వచ్చింది. పూర్తిగా నిర్వీర్యమైపోయిన దశలో బీజేపీకి గుడ్ బై చెప్పింది. ఇంత కంటే కావాల్సిందేముందని బీజేపీ అనుకుంటోంది.
బీహార్లో జేడీయూ ఒకప్పుడు మేజర్ పార్టీ. బీజేపీ పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకునేది. ఇప్పుడు జేడీయూ అల్ప స్థానానికి పడిపోయింది. నితీష్ తర్వాత నాయకత్వం లేదు. రేపోమాపో షిండే తరహాలో ఆయనపై ఓ నేతను ప్రయోగించి ఇంట్లో కూర్చోబెట్టేందుకు ప్రణళిక సిద్ధం చేసినట్లుగా తెలియడంతో చివరి క్షణంలో నితీష్ ..ఆర్జేడీని పట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. కానీ దీన్ని బీజేపీ లైట్ తీసుకుంటోంది. తాము బీహార్ మొత్తం విస్తరించడానికి ఇంత కన్నా మార్గం ఏముంటుందని అనుకుంటోంది. అయితే బీజేపీతో పొత్తులో శిఖరంలాగా ప్రారంభమైన జేడీయూ ఇప్పుడు అంతర్ధాన సమస్యను ఎదుర్కొంటోంది.
ఒక్క జేడీయూనే కాదు బీజేపీ చరిత్ర చూస్తే.. ఆ పార్టీ మిత్రపక్షాలను మింగేస్తూ పోతోంది. శివసేనతో పాతికేళ్ల కు పైగా స్నేహం ఉంది. ఇప్పుడా పార్టీని చీలికలు పేలికలు చేశారు. పంజాబ్లో అకాలీదళ్ పరిస్థితి అంతే. తాము బలహీనంగా ఉన్న చోట్ల పొత్తులంటూ బలమైన పార్టీలతో కలసి నడుస్తారు. ఈ క్రమంలోఆ పార్టీలను మింగేస్తారు. ఏపీలో జనసేననూ అలాగే మింగేసే ప్రయత్నం చేశారు. సాధ్యంకాదు. ఇప్పుడు టీడీపీపై మళ్లీ దృష్టి పెడుతున్నారు. కలిసే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఉంటే..ఏం జరిగి ఉండేదో కానీ టీడీపీ మాత్రం కాస్త బయటపడింది.
బీజేపీ స్నేహం ఉచ్చులో చిక్కుకుని అంతర్ధానం అయిన పార్టీలు చాలా ఉన్నాయి. అయినా ఆ పార్టీ నేతలు చాలా మంది.. పొత్తులతో తాము నియంత్రణకు గురవుతున్నామని.. తమను ఎదగకుడా కుట్ర చేస్తున్నారని ఇతర మిత్రపక్ష పార్టీల నేతల్ని విమర్శిస్తూ ఉంటారు.అదే రాజకీయం ఏమో..!