ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మూలవిరాట్ . ఆయన చేసేది.. చేయించేది వేరే. కానీ ఆయన తరపున పనులు చక్కబెట్టేవాళ్లు కొంత మంది. ఇప్పటి వరకూ అలాంటి వారిలో బాగా ప్రాచుర్యం పొందింది సజ్జల రామకృష్ణారెడ్డే. డిఫ్యాక్టో సీఎం అని టీడీపీ నేతలు చేసే విమర్శల్ని ఆయన పొగడ్తలుగా భావిస్తూంటారు. అయితే ఇప్పుడు మరో వ్యక్తి కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నారు. ప్రభుత్వంలో తన మాటే శాసనం అనిపించుకునేలా ఆ వ్యక్తి ఎదుగుతున్నారు. ఆయన ఎవరంటే.. స్వరూపానంద స్వామి.
జగన్‌కు స్వరూపానందపై చాలా గురి ఉంది. దానికి కారణాలేమిటనే విషయాన్ని పక్కన పెడితే.. జగన్‌కు తనపై ఉన్న గురిని పక్కాగా ఉపయోగించుకోవడంలో మాత్రం స్వరూపానంద రాటుదేలిపోయారు. ఎక్కడ అవసరం అయితే అక్కడ భూములు కేటాయింప చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో బాగు చేయించుకుంటున్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న శారదాపీఠం స్థలాన్నిఆక్రమించుకుని క్రమబద్దీకరించుకున్నారు. తిరుమలలో శారదాపీఠం తరపున నిర్మించిన అతిథిగృహాన్నీ అలాగే నిబంంధనలు ఉల్లంఘించి క్రమబద్దీకరించుకున్నారు.
విశాఖలో ఇప్పటికే ఓ చోట స్థలం కేటాయింపులు చేయించుకోగా.. ఇప్పుడు మరో చోట స్థలం కేటాయింపులు చేయించుకోవడమే కాకుండా దాన్ని ప్రజాధనం పెట్టి చదును కూడా చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు దేవాదాయశాఖలో ఏ ఆదేశం అయినా స్వరూపానంద ఆమోదం మేరకు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాజాగా తన ఏజెంట్‌గా ఆయన ఓ సలహాదారుడ్ని కూడా నియమించుకున్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఓ జిల్లా కోఆర్డినేటర్‌గా చేసిన వ్యక్తిని స్వరూపానంద ఏజెంట్‌గా దేవాదాయశాఖలో సలహాదారుగా నియమించేశారు. ఇప్పుడు నేరుగా దేవాదాయశాఖ శారదాపీఠం చేతిలోకి వచ్చేసిటన్లయింది.
స్వరూపానంద ఇంత పకడ్బందీగా ఎలా వ్యవహారాలు నడుపుతున్నారాలో చాలా మందికి పజిల్‌గానే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డికి పోటీగా స్వరూపానంద వైసీపీ ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్‌గా ఎదిగారని మాత్రం అందరూ డిసైడైపోయారు.