తెలంగాణ సీఎం కేసీఆర్ పదకొండో తేదీన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. మామూలుగా అయితే ఈ కేబినెట్ భేటీలు సాధారణమే. కానీ ఇప్పుడు వేరు. మునుగోడు ఉపఎన్నిక ఎదురుగా ఉంది. బీజేపీ దూకుడు మీద ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ కసరత్తు చేసి ఉంటారని .. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికే కేబినెట్ భేటీ అంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.
సీఎం కేసీఆర్కు ఇప్పుడు ఉన్నసవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు బీజేపీ ఆర్థికంగా దిగ్భంధనం చేస్తోంది. జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది. మరో వైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉపఎన్నిక వచ్చి మీద పడింది. అయితే ఉపఎన్నిక వస్తుందని తెలిసినా టీఆర్ఎస్ అంత యాక్టివ్ కావడం లేదు. పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉపఎన్నికను ఎదుర్కోవడం కన్నా … ముందస్తుకు వెళ్లడమే బెటరని పార్టీలోని ఓ వర్గం బలంగా ఫీడ్ బ్యాక్ ఇస్తూండటంతో కేసీఆర్ కూడా డైలమాలో ఉన్నారని చెబుతున్నారు.
మునుగోడులో టీఆర్ఎస్కు అంత గొప్ప అవకాశాలు లేవనేది ఎక్కువమంది చెప్పేమాట. అది జస్ట్ ఉపఎన్నిక మాత్రమేనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కూడా దాన్ని ఒప్పుకున్నట్లయింది. ఈ ఉపఎన్నిక ముగిసిన మరో ఎడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇన్నిసవాళ్లు అవసరమా అన్న వాదన కూడా టీఆర్ఎస్ లో వినిపిస్తోంది . ఉపఎన్నికలెందుకు నేరుగా అసెంబ్లీనే రద్దు చేస్తున్నాం.. వెంటనే ఎన్నికలు పెట్టండి అని బీజేపీకి కేసీఆర్ సవాల్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.
మునుగోడు ఉపఎన్నిక వచ్చే నెలాఖరులోనే జరగొచ్చని.. ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కాదంటే… గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు నవంబర్, డిసెంబర్లో జరుపుతారు. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా అంతకు మించి ఆలస్యం చేసే చాన్స్ ఉండకపోచవచ్ంటున్నారు. ఎందుకంటే ఉపఎన్నిక నిర్వహించడానికి లేని అడ్డంకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకని వాదించవచ్చు. అయితే కేసీఆర్ నిర్ణయం ఏమిటన్నదానిపై కనీస సమాచారం బయటకు రావడంలేదు. కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.