నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు సముద్రఖని. తెలుగులో ఇప్పుడు తానో బిజీ ఆర్టిస్ట్. తమిళంలో కూడా అంతే. దర్శకుడిగా వైవిధ్యభరితమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. త్వరలోనే పవన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ కోసం కూడా ఓ కథ రెడీ చేసుకొన్నాడు సముద్రఖని. `మాచర్ల నియోజక వర్గం`లో సముద్రఖని ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో `సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది` అని మనసులోని మాట బయటపెట్టాడు నితిన్. ఇప్పుడు సముద్రఖని కూడా అదే అంటున్నాడు.
”నితిన్ తో సినిమా తప్పకుండా ఉంటుంది. రెండేళ్ల క్రితమే మేం కథ గురించి మాట్లాడుకున్నాం. సమయం కుదిరినప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, నాని – దసరా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ”నటన, దర్శకత్వం ఏదైనా సరే, నా మనసుకి నచ్చిన ప్రాజెక్టే చేస్తా. ప్రేక్షకులు నాపై నమ్మకం ఉంచారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా..” అని చెప్పుకొచ్చారాయన. పవన్ కల్యాణ్ తో సినిమా ఈపాటికే మొదలవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది.