తెలంగాణలో యూపీ తరహాలో విజయం సాధించాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందు కోసం ప్రత్యేకంగా స్కెచ్ వేసింది. ఈ స్కెచ్లకు ఆర్టిస్టులను కూడా రంగంలోకి దింపుతోంది. తాజాగా తెలంగాణకు బీజేపీ ఇంచార్జ్‌గా సునీల్ భన్సల్ అనే ఉత్తరాది వ్యక్తిని నియమించారు. ఈయన తెర వెనుక రాజకీయాలకు ప్రసిద్ధి. బన్సల్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ కో ఇంఛార్జ్ గా పని చేశారు బన్సాల్.
యూపీ ఎన్నికల్లో 2017లో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రధాన ప్రణాళికా కర్తగా వ్యవహరించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్నింటా బన్సల్ ఫోకస్ పెట్టనున్నారు. యూపీలో అభ్యర్థుల ఎంపిక వెనుక బన్సల్ కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా పెద్దగా పరపతి లేకపోయినా వ్యూహాలు రచించడం, అమలు చేయటంలో బన్సల్ దిట్టని చెబుతారు. తెరవెనుక ఉంటూనే వ్యూహ రచనలు చేస్తూ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషిస్తారు.
వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఇప్పటి నుండే బీజేపీ జాతీయ నాయకత్వం నియామకాలు చేపట్టినట్లుగా కనిపిస్తోంది. ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీల విషయంలో ఇటీవల మార్పులు చేస్తోంది. అమిత్ షాకు దగ్గరి మనిషిని రంగంలోకి దింపడంతో యూపీ ఫార్ములానే తెలంగాణలో పాటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాది రాజకీయాలు తెలంగాణలో వర్కవుట్ అవుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది.