మమతా బెనర్జీ సైలెంటయిపోయారు. కేసీఆర్ రంగంలోకి దిగుతారో లేదో తెలియదు. దిగినా ఆయనకు మోదీకి ధీటైన నేతగా ఒప్పుకునేందుకు ఉత్తరాది నేతలే కాదు దక్షిణాది వారు కూడా అంగీకరించరు. అఖిలేష్ యాదవ్ రెండో సారి ఓడిపోవడంతో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోలేదు. శరద్ పవార్ వయసైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే విపక్ష కూటమిలో ప్రాంతీయ పార్టీల్లో మోదీకి ధీటైన నేత లేరు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఉన్నా.. సరిపోవడం లేదు. ఇవన్నీ ఆలోచించుకునే నితీష్ కుమార్ బీజేపీని డంప్ చేసి.. కాంగ్రెస్ కూటమి వైపు నడిచారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ కూటమిలో నితీష్‌కు ఒకప్పుడు మోదీ కన్నా ఎక్కువ ఇమేజ్ ఉండేది. బీహార్‌ను మార్చేశారని.. సుపరిపాలకుడని.. ఆయన దేశానికి మంచి నాయకత్వం ఇవ్వగలరని చెప్పుకున్నారు. నితీష్ కూడా ఆశపడ్డారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ఖరారు చేసే ముందు నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి కావాలని ప్రయత్నించారు. నితీష్ కుమార్ అప్పట్లో మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలగుతుందని హెచ్చరించారు. అన్నట్లుగానే మోదీనే ఖరారు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.
అయితే మోదీ ప్రదాని అయిన తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. నితీష్ మాత్రం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. పైగా ఆయన పార్టీ కరిగిపోతోంది. దీంతో చివరి ప్రయత్నంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తెర ముందుకు రావాలని .. వ్యూహం పన్నారు. ఇటీవల నితీష్ కు కూడా ప్రధానమంత్రి అయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని, సమర్ధుడైన జాతీయ నాయకుడని ఆ పార్టీ తీర్మానం చేసింది. మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత వ్యతిరేకతపెరిగిందని నితీష్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని అడ్డుకుంటామన్న సంకేతాలు పంపేందుకు నితీష్ ఆ ఎన్టీఏతో కటీఫ్ చెప్పారని అంటున్నారు.