వైసీపీలో ఉంటే ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు అందర్నీ బండబూతులు తిట్టాలి. ఆలా ఎందుకు తిట్టాలో అడగకూడదు. తిట్టాలంతే. తిడితే పార్టీలో భవిష్యత్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ బయట మాత్రం భవిష్యత్ ఉండదు. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు అసలు రాజకీయం అర్థం అవుతోంది. నెల్లూరుజిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇదే అంటున్నారు. వైసీపీ తరపున సీఎం చెప్పినా గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. రెండు సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది.
దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. తాను కొడాలి నాని కన్నా చంద్రబాబును ఎక్కువగా తిట్టానని టీడీపీలో ఎలా చేరుతానని ప్రశ్నిస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం.. అంత దారుణంగా తిట్టిన తర్వాత తనను టీడీపీలోకి ఎలా తీసుకుంటారన్నదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ నే. ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి నుంచి టీడీపీనే. అయితే వైఎస్ ఆకర్ష్‌లో పడి ఆయన పార్టీ మారారు. ఆ తర్వాత వైఎస్ చనిపోవడంతో జగన్ వెంట నడుస్తున్నారు. కానీ ఆయనకు ఎలాంటి గుర్తింపు లభించడం లేదు.
మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన.. అనిల్ కుమార్‌కు… గౌతంరెడ్డి.. రెండో సారి కాకాణికి కూడా ఇచ్చారు కానీ.. పార్టీ వ్యవస్థపక ఎమ్మెల్యేల్లో ఒకరినైన తనకు మాత్రం చాన్సివ్వలేదని ఆయన ఫీలవుతున్నారు. గతంలో జగన్ ను మెచ్చేందుకు ఇష్టం వచ్చినట్లుగా అందర్నీ బూతులు తిట్టే ఆయన ఇప్పుడు పెద్దగా నోరు తెరవడంలేదు. తత్వం బోధపడిందేమో కానీ.. ఇప్పుడు వైసీపీ తప్ప వేరే దిక్కు లేదని అనుకుంటున్నారు . అందుకే పార్టీ మారనని చెబుతున్నారు కానీ.. బూతులు తిట్టడంలేదు. మళ్లీ హైకమాండ్ ఒత్తిడి చేస్తే ప్రారంభిస్తారేమో చూడాలి. ఈ నల్లపురెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి బావమరిది.