కార్పొరేషన్లు పెట్టి బీసీ , ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య సహా అన్ని కులాలకు పైసా సాయం చేయకపోగా.. అందరికీ ఇస్తున్న పథకాలు లెక్కలు చెబుతూ బురిడీ కొట్టిస్తున్న వైసీపీ సర్కార్… వారికి కోపం రాకుండా కొత్త ఆలోచనలు చేస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా వారిని సంతోషపరిచేందుకు జీవోలు జారీ చేస్తోంది. నాయీ బ్రాహ్మణులను నాలుగు పదాల పేర్లను ఉపయోగిస్తున్నారంటూ వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కించపరుస్తూ మాట్లాడేవారిపై భారత శిక్ష్మాస్మృతి 1860 కింద చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మూడు రోజుల కిందట జారీ చేసిన జీవోను ఇవాళే వెలుగులోకి తెచ్చారు. ఆ వెంటనే వైసీపీ నేతలు పలు చోట్ల పాలాభిషేక కార్యక్రమాలు పెట్టుకున్నారు.
నిజానికి నాలుగు పదాలు మాత్రమే నిషేధం విధించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయన్న వాదన నాయీ బ్రాహ్మణుల్లో ఉంది. తమను కించ పరిచేలా ఉన్న ఇతర పదాలను వాడవచ్చని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వినిపిస్తోంది. నాయీ బ్రాహ్మణలకు ఏదో మేలు చేశామన్న అభిప్రాయం కల్పించడానికే ఈ ఉత్తర్వులు ఇచ్చారన్న వాదన ఇతర పార్టీల నేతల్లో వినిపిస్తోంది.
కుల వృత్తుల్లో చాలా వరకూ ఇలాంటి అభ్యంతరకర పదాలను ఎదుర్కొంటూ ఉంటారు. చివరికి అగ్రకులాలు వారిని కూడా ఇతరులు ఇలాంటి పదాలతో తిడుతూ ఉంటారు. ఇప్పుడు తమను అలా కించ పరిచే పదాలను నిషేధించాలనే డిమాండ్ ఇతర వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారందర్నీ సంతృప్తి పరిచి.. వారి డిమాండ్లను పరిష్కరించామనడానికి ప్రభుత్వం రెడీగా ఉండే అవకాశం ఉంది. వెంటనే పాలాభిషేకాలు కూడా ఎలాగూ ఉంటాయి. బతుకుల్ని బాగు చేయాల్సిన ప్రభుత్వం ఇలాంటి జీవోలు రూపాయి ఖర్చు లేకుండా ఇస్తూ.. వారికి మేలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ లేనిపోని సమస్యలు తెచ్చి పెడుతోందన్న వాదన వినిపిస్తోంది.