కేంద్రం సహకరించండం లేదు. ఖర్చులకు తగ్గట్లుగా రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. ఆదాయం ఎలా తెచ్చుకోవాలి అన్న ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఐదు గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మీడియాకు వచ్చిన ఇన్ పుట్స్ ప్రకారం చూస్తే.. అసలు ఆదాయ మార్గాలపైనే చర్చ జరగలేదు. కానీ ఖర్చులను మాత్రం భారీగా పెంచుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా పది లక్షల పెన్షన్లను అదనంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు దాదాపుగా 30 లక్షల పెన్షన్లు ఉంటే… ఆగస్టు పదిహేను నుంచి నలభై లక్షల పెన్షన్లు అవుతాయి. ప్రతి ఒక్కరికి రూ. రెండు వేలు చొప్పునప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. కేంద్రం అప్పులు చేయనివ్వడం లేదు. వివిధ ప్రాజెక్టుల కోసం గతంలో చేసిన అప్పుల పరిమితి దాటిపోయినందున ఈ ఏడాది పూర్తిగా నియంత్రించారు. అందుకే సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. జిల్లాల వారీగా జీతాలు ఇస్తూ.. పోతున్నారు. ఒక్కో సారి నెలాఖరు వరకూ జీతాలిస్తున్నారు. పెండింగ్ బిల్లులు పరిమితంగానే చెల్లిస్తున్నారు.
అతి కష్టం మీద పథకాలు అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా సంక్షేమ పథకాల కోసం భారీగా ఖర్చు పెట్టుకుంటూ పోవడం తెలంగాణ అధికారవర్గాలకూ ఇబ్బందికరంగానే ఉంది. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను పెద్ద ఎత్తున అమ్మి నిధులు సేకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఈ విషయం బయటకు చెప్పలేదని అంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోతే.. మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్థిక మంత్రిగా హరీష్ ఉన్నా ఆయన తీసుకునే నిర్ణయాలు తక్కువే.