మంగళగిరిలో టీడీపీ నేతలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే అది టీడీపీలో కాదు. టీడీపీలో ఉన్నందుకు వైసీపీ నుంచి. అందులోనూ బీసీ నేతలకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించడాన్ని వైసీపీ ఓ మిషన్‌గా పెట్టుకుంది. లోకేష్ చురుకుగా పని చేస్కుంటూండటం.. అన్న క్యాంటీన్లతో పాటు స్వయం ఉపాధి పనులు చేయడం వంటివి చేస్తున్నారు. ఆయన టీం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు.
అయితే ఈ సారి లోకేష్ మీద బీసీ అభ్యర్థిని అదీ కూడా .. టీడీపీ వల్ల అన్యాయమైపోయిన బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నాం అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి టీడీపీ నుంచే బీసీ నేతల్ని వెదుక్కుంటున్నారు. చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఈ సారి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం ఖాయంగాకనిపిస్తోంది. ఆయనకు టిక్కెట్ ఆశ చూపి వైసీపీలో చేర్చుకున్నారు. వైసీపీ స్థాయిలో ఆరోపణలు చేయాలని..హైకమాండ్‌ను మెప్పించాలని ఆయనకు టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చివరికి ఆయనకు ఇస్తారో ఇంకెవరికైనా ఇస్తారో కానీ ఇప్పటికైతే టీడీపీ నుంచి వెళ్లిన బీసీ నాయకుడికే టిక్కెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు.
లోకేష్ ను ఎలాగైనా రెండో సారి కూడా ఓడగొడితే ఆయన ఇక నాయకుడిగా ఎదగలేరనన్నది వైసీపీ ప్లాన్. లోకేష్ కూడా తాను రెండో సారి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్‌కు గండమేనని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంగళగిరి ప్రజల్లో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి వైసీపీ టార్గెట్ మాత్రం క్లియర్ గా ఉంది. టీడీపీలో ఎంత సిన్సియర్ నేతలుంటారన్నదే ఇప్పుడు కీలకం.