ప్రభుత్వాలను కూలగొడుతున్న బీజేపీకి షాక్ ఇచ్చి.. ఆ పార్టీనే డంప్ చేసిన నితీష్ కుమార్‌తో అర్జంట్‌గా భేటీ కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆయన బీహార్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నితీష్, తేజస్విలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ టూర్లో బీజేపీని ముందు ముందు ఎలా ఎదుర్కోవాలో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఏదో ఓ పని లేకుండా కేసీఆర్ వెళ్లరు కాబట్టి.. ఆర్మీలో పనిచేసి అమరులైన జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున చెక్కుల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం అని ప్రకటించే అవకాశం ఉంది. అమర జవాన్ల కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమంతో పాటు రాజకీయ చర్చలే బిహార్ టూర్లో కీలకమైనదిగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు బిహార్ నుంచే తన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ప్రయత్నాలను ప్రారంభించనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికి గట్టిగా వారే నిలబడ్డారు. గతంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ-జేడీయూ మధ్య బంధం తెగిపోయిన తర్వాత బిహార్ వెళ్ళి నితీష్, తేజస్విలతో భేటీకి ప్రయత్నిస్తున్నారు.