కీలకమైన మునుగోడు ఉపఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి దూకుడుపై నల్లగొండ సీనియర్లు పిర్యాదు చేయడంతో ఈ ఉపఎన్నిక విషయంలో ఆయనను పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మునుగోడులో పాదయాత్రకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి కరోనా వచ్చిందని చెప్పి డుమ్మా కొట్టేశారు. అంతే కాదు మాస్క్ పెట్టుకుని కోమటిరెడ్డికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రేవంత్‌కు కరోనా కాదని..హైకమాండ్ ఆయను మునుగోడు ఉపఎన్నిక విషయంలో తగ్గమని చెప్పిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
నల్లగొండ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని ఆ జిల్లా సీనియర్ నేతలు హైకమాండ్ వద్ద ఫిర్యాదు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారక ముందు ఆయనను బుజ్జగించే బాధ్యతను .. అదే జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకోలేదు. ఇప్పుడు కూడా ఉపఎన్నిక బాధ్యతలను నల్లగొండ జిల్లాకు కీలక నేతలుగా ఉన్నా తామే చూసుకుంటామని హైకమాండ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కువగా జోక్యం చేసుకుంటే.. మిగతా నేతలు పని చేసే చాన్స్ ఉండదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఉభయతారకంగా మునుగోడు విషయంలో రేవంత్ రెడ్డి జోక్యం మరీ ఎక్కువ వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికకోసం ఇప్పటికే మధుయాష్కీ నేతృత్వంలో కమిటీ వేశారు. ఉత్తమ్, జానారెడ్డి వంటి వారు తాము చూసుకుంటామన్నారు. దీంతో రేవంత్ సైడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది .