మాధవ్ వీడియో సోషల్ మీడియాలో వస్తే దాన్ని మీడియాకు ఎక్కించి ఆయనను రోడ్డు మీద నిలబెట్టిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను అంత కంటే ఎక్కువంగా మానసికంగా ఇబ్బందిపడేలా తిట్టారు హిందూపురం ఎంపీ. అలా ఆయన స్వతహాగా తిట్టరని ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి అండ్ కో తిట్టించారని ఆర్కే గట్టిగా నమ్ముతున్నారు. ఈ వారం తన వారాంతపు పలుకు మొత్తాన్ని మాధవ్‌కే అంకితం చేశారు. విలువలు పతనమైపోతున్నాయని బాధపడ్డారు. వైసీపీని దిగంబర పార్టీగా ఈసడించుకున్నారు.
అయితే ఇక్కడ మాధవ్‌ను సమర్థిస్తున్న వారికి ఓ సవాల్ కూడా చేశారు. అదేమిటంటే.. మాధవ్‌ను అంతగా సమర్థిస్తున్న వారెవరైనా సరే.. ఆయనను తమ ఇంటికి ఆహ్వానించి.. తమ ఇంట్లో ఆడవాళ్లకు పరిచయం చేయగలరా.. ? ఇంటికి పిలిచి భోజనం పెట్టగలరా ? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జగన్ తన ఇంట్లోకి కూడా రానివ్వరని చెబుతున్నారు. సమర్థిస్తున్న మహిళా మంత్రులు.. గతంలోలా మాధవ్‌తో స్నేహంగా ఉండగలరా అని ఆర్కే చాలెంజ్ చేశారు. వికావాలంటే ఇంటికొచ్చి చూపిస్తామని.. తమకు మాధవ్ సవాల్ చేశారని.. ఆయనకు టిక్కెట్ ఇచ్చి చట్టసభ సభ్యుడిని చేసిన వారికి చూపించాలని ఆర్కే కౌంటర్ ఇచ్చారు.
రాజకీయాల్లో విలువలు అనేవే లేవని ఇటీవలి కాలంలో ఎన్నో సార్లు బయటపడింది. ఇంత కంటే దిగజారిపోరని అనుకున్న ప్రతీ సారి అదే పరిస్థితి. ఇప్పుడు ఎంపీలు దిగంబరంగా బయటపడి.. సమర్థించుకునే పరిస్థితి వచ్చిందని.. ఒకప్పుడు కోర్టు చిన్న విమర్శ చేసిందని రాజీనామా చేసిన ముఖ్యమంత్రులున్నారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా తప్పు కాదని ఒప్పుకున్న ఆర్కే.. నైతిక పరంగా మాత్రం చర్య తీసుకోవాలన్నడిమాండ్ మాత్రం ఇంకా వినిపిస్తున్నారు.
ఒకప్పుడు వృద్ధ గవర్నర్ తివారీ ప్రైవేటు ఫోటోలను.. ఆయనకు సన్నిహితులే తీసి ఇస్తే.. ఏబీఎన్ పండగ చేసుకుంది. అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకోవడంతో.. ఆ క్రెడిట్ దక్కింది. ఈ సారి అలాంటి క్రెడిట్ దక్కకపోగా.. తమపైనే బూతులతో విరుచుకుపడటంతో ఆర్కే ఫీలవుతున్నారు. రెండు వైపులా పతమవుతున్న విలువలకు.. అటు ఆర్కే.. ఇటు జగన్ సాక్షిగా నిలుస్తున్నారన్న విమర్శలు ఇలాంటి పరిణామాల వల్లే వస్తూంటాయి.