మునుగోడు ఉపఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా కమ్యూనిస్టుల మద్దతు కీలకం కానుంది. అక్కడ లెఫ్ట్ పార్టీలకు ఇక్కడ దాదాపు 20 వేల ఓట్లు ఉంటాయని అంచనా. అందుకే ఆ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ రెండు పార్టీల్లోనూ టీఆర్ఎస్ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుందని, భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
స్థానిక ఎన్నికల్లో నారాయణపూర్, చౌటుప్పల్లో గతంలో సీపీఎం, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగించాలని సీపీఎం భావిస్తోంది. హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన సీపీఐ.. ఆ తర్వాత టీఆర్ఎస్పై విమర్శలు చేస్తోంది. అయితే స్థానిక నాయకత్వం టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతోంది. టీఆర్ఎస్ తమను ఫోన్లో సంప్రదించాయని, రాతపూర్వకంగా మద్దతు కోరితే ఈ నెల 20న నిర్ణయం తీసుకుంటామని కమ్యూనిస్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
కమ్యూనిస్టులు ఎవరికీ మద్దతు ప్రకటించకుండా పోటీలో ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అందుకే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. కమ్యూనిస్టులపై పరుషమైన విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే పోటీ చేయాలని అంటున్నారు. దీనికి కమ్యూనిస్టు నేతలు కొంటర్ ఇస్తున్నారు. ఇప్పటికైతే కమ్యూనిస్టులు పోటీ చేయడం లేదు. వారు ఎవరికి మద్దతు ఇస్తే వారికి అడ్వాంటేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.