తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫ్రీడం ర్యాలీ పేరుతో జాతీయ జెండాలతో ర్యాలీ చేసి.. అదేదో బారాత్ అయినట్లుగా పోలీసుల దగ్గర తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపేశారు. అదేమంటే.. తాను షూటింగ్ అసోసియేషన్ సభ్యుడినని తనకు రైఫిల్ ఎస్పీనే ఇచ్చారంటూ వాదించడం ప్రారంభించారు. షూటింగ్ అసోసియేషన్ సభ్యుడు అయితే ఎస్పీ తుపాకీ ఇచ్చేస్తారా..? గాల్లోకి కాల్పులు జరిపేస్తారా అంటే ఓ సారి బుల్లెట్లు లేవని..మరోసారి రబ్బర్ బుల్లెట్లు కాల్చామని శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. యాధావిధిగా తనను రాజకీయంగా అణగదొక్కడానికి చేస్తున్న కుట్రని కూడా చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఆ రైఫిల్ ఎస్పీ.. శ్రీనివాస్ గౌడ్‌కు ఎందుకు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఎస్పీ ఇచ్చాడో లేదో కానీ.. ఆయన మాత్రం బహిరంగంగా చెప్పుకోలేడు. తెలుగు రాష్ట్రాల ఎస్పీల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మహా అయితే డీజీపీకి చెప్పుకోగలరు. కానీ అక్కడ కూడా స్పందన రాలేదు. కేవలం నివేదిక ఇవ్వమని డీజీపీ ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎస్పీ మెడకు చుట్టుకుంటుందని అంటున్నారు.
గాల్లోకి కాల్పులు జరపడం నేరం. పెళ్లిళ్లలో కొంత మంది లైసెన్స్డ్ తుపాకులతో కాల్పులు జరిగినా పోలీసులు కేసులు పెడుతూంటారు. ఎందుకంటే కాల్పులు అనేది తీవ్రమైన నేరం. అయితే ఇక్కడ చేసి మంత్రి కాబట్టి ఆయన చట్టానికి అతీతుడన్నట్లుగా తీరు ఉంది. ఇప్పుడు ఆయన చేతికి గన్ ఎవరు ఇచ్చారు.. బుల్లెట్లు ఎలా కాల్చారు… ఇవన్నీ బయటకు తేలాల్సి ఉంది. అదే జరిగితే పోలీసులు అధికారులు ఇరుక్కుపోయే చాన్స్ ఉంది. కానీ మంత్రిగా కాబట్టి పేరుకే దర్యాప్తు.. నివేదికలు కానీ అసలు చర్యలుండవని ఎక్కువ మంది నమ్ముతున్నారు