అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ కు ఇంకా ఆ వారం రాలేదు. రాదని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. డీఏలు ఇచ్చి.. అదే పీఆర్సీ అని అడ్డగోలుగా వాదించి.. జీతాలు పెరగకుండా చేసింది. అనేక సౌకర్యాలను కట్ చేసింది. అదే సమయంలో వారంలో రద్దు అన్న సీపీఎస్ పై మడమ తిప్పుతోంది. సీపీఎస్ ను రద్దు చేయాలంటే పెద్ద మొత్తంలో బడ్జెట్ కావాలని.. కానీ అంత లేదని.. అవగాహన లేకుండా ఇచ్చామని చెబుతోంది. అయితే సీపీఎస్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో పోరుబాట పట్టారు.
జగన్ చెప్పిన వారం ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రోడ్డెక్కుతున్నారు. ఎన్నికలకు ఇలాగే వెళ్తే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సీన్ మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీపీఎస్ రద్దు చేస్తున్నామని ఎన్నికలకు ముందు ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసిన రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో పరిశీలించి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో దీనిపై మళ్లీ ఓ కమిటీ వేసి.. కొంత కాలం సాగదీసి.. ఆ తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు తాము చెప్పిన వారం పూర్తి అయిందని చెప్పి రద్దు చేస్తున్నామని చెప్పే అవకాశం ఉంది.
ఉద్యోగులను అనేక రకాలుగా మోసం చేసిన ప్రభుత్వం రద్దు చేస్తున్నామని చెప్పి ఎన్నికలకు వెళ్తే ఉద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు. రద్దు చేసి.. పూర్తి స్థాయిలో పాత పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుంది. మరి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేస్తుందో లేదో స్పష్టత లేదు. అయితే ఉద్యోగులకు మాత్రం గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.