దేశంలో అరవై శాతం మంది జనాభాకు ఇప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వాల్సి వస్తోంది ! లక్షల కోట్ల పన్నులు వసూలు చేస్తున్నా విద్య, వైద్యం ఉచితంగా అందించలేకపోతున్నారు. మన దేశ మానవ వనరులు.. వలసపోయి ప్రపంచంలోని అనేక దేశాలను ఆర్థికంగా శక్తివంతం చేస్తున్నారు. కానీ మనం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాం. ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్నంత జనాభాను.. మానవ వనరుల్ని పెట్టుకుని ఈ 75 ఏళ్లలో మనమేం సాxధిచాం ?.
ఏ వ్యక్తి అయినా.. సంస్థ అయినా .. ఓ మైలు రాయి అందుకున్నప్పుడు సంబరాలు ఎంతగా చేసుకుంటారో.. తమ చేసిన తప్పులను రివ్యూ చేసుకుంటారు. తర్వాతి లక్ష్యాలను కూడా అంతే స్థాయిలో ఏర్పరుచుకుంటారు. భారత్‌లో సంబరాలు ఇంటింటికి చేరాయి. ప్రతి ఒక్కరికి జాతీయ జెండా పంపిణీ చేశారు. ఆ సంబరాలకు మహోన్నతంగా సాగుతున్నాయి. కానీ స్వాతంత్రం తెచ్చుకుని 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో దేశం ఎంత సాధించాలి ? ఎంత సాధించింది ? ఎక్కడ లోపం ఉంది ? పాలకులు మారాలా ? ప్రజలు మారాలా ? అన్నాదానిపై పెద్దగా చర్చ జరగడం లేదు.
ముందుగా చెప్పుకున్న భారత్ బాగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ మనతో పయనం ప్రారంభించిన ఎన్నో దేశాలు అభివృద్ధి సాధించేశాయి. అత్యధిక జనాభాను ప్లస్‌గా చేసుకున్న చైనా వంటి దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దాటిపోయాయి. కానీ మనం మాత్రం ఇంకా ప్రజలకు రేషన్ బియ్యం.. ఉప్పులు.. పప్పులు పంపిణీ చేస్తూ.. అదే గొప్ప అభివృద్ధి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
మన దేశానికి ప్లస్ మైనస్ రెండూ ప్రజాస్వామ్యమే. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ఉండటం ప్లస్ అయితే.. ఆ ప్రజల్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు.. ఓటు బ్యాంక్ అనే గిరి గీసుకుని..అందు కోసమే పాలన సాగిస్తూండటం మైనస్. అధికారం నిలుపుకోవడానికి అంతకు మించి ఆలోచించడానికి పరిపాలన చేసే ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదు. అలాంటి ఆలోచనల్లో మార్పు చేసి… దేశమే మిన్నగా పరిపాలన చేసే రోజున దేశానికి అసలైన స్వాతంత్యం వస్తుంది. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుంది. అప్పుడు స్వాతంత్య్ర సంబరాలు… ఈవెంట్‌లా కాకుండా ప్రజలు స్వచ్చందంగా చేసుకుంటారు. అలాంటి పరిస్థితి రావాలి !
జైహింద్ !