బింబిసార ఫలితంతో సంబంధం లేకుండా బింబిసార 2 తీస్తామని చిత్రబృందం ముందే ప్రకటించింది. ఇప్పుడు బింబిసార అనూహ్యమైన విజయాన్ని అందుకొంది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు బింబిసార 2కి రంగం సిద్ధం అవుతోంది. నిజానికి.. బింబిసార సమయంలోనే పార్ట్ 2 తీయాలన్న ఆలోచన ఉంది కానీ, కథని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో క్లారిటీ లేదు. బింబిసార క్లైమాక్స్ లో బింబిసార చనిపోతాడు. అయితే.. తనని మళ్లీ బతికించే అవకాశం ఉంది. ఎందుకంటే సంజీవని పుష్పంతో ఓ ప్రాణాన్ని బతికించొచ్చు అనే విషయం బింబిసార కథ ప్రారంభంలోనే చెప్పాడు దర్శకుడు. కాబట్టి ఆ ఆప్షన్ ఉపయోగించుకొని పార్ట్ 2 మొదలు పెడతారు.
ఈసారి పార్ట్ 2లో బింబిసారుడి కథ గురించి ఎక్కువగా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. బింబిసారుడు అంత క్రూరుడిగా, స్వార్థ పరుడిగా ఎలా మారాడు? తమ్ముడితో (మరో కల్యాణ్ రామ్) వైరం ఎందుకు వచ్చింది? అనేది చూపిస్తూనే మళ్లీ మాయా దర్పణాన్ని వాడబోతున్నారని సమాచారం. పార్ట్ 1లో బింబిసారుడు 5వ శతాబ్దం నుంచి 2022లోకి వచ్చేశాడు. పార్ట్ 2లో.. మరో బింబిసారుడి కాలం కంటే వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్. ఎలాగూ ఫిక్షన్ కాబట్టి.. కథని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కాబట్టి… దర్శకుడి ముందు చాలా ఛాయిస్లు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఎంచుకొనే కసరత్తు అతి త్వరలో మొదలెట్టబోతున్నార్ట. బింబిసార కంటే పార్ట్ 2కి ఎక్కువ బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది.’