రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏర్పాటుచేసిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అసెంబ్లీ మినహా… జగన్ , చంద్రబాబు ఒకే వేదికపై ఎప్పుడూ కనిపించలేదు. చాలా సందర్భాల్లో జగనే ఎవాయిడ్ చేశారు అయితే ఎట్ హోంలోనూ వారు ముక్తసరిగా పలకరించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిస్తే… రాజకీయాలు ఎలా ఉన్నా, అప్పటికి ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. ఇరువురు నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకొనేవి. జగన్ హయాంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉప్పు-నిప్పు అన్నట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. గత వారం దిల్లీలో జరిగిన అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో జగన్ పాల్గొనాల్సి ఉన్నా… చంద్రబాబు మాత్రమే హాజరయ్యారు. జగన్ హాజరు కాలేదు.
అక్కడే ఉన్నప్పటికీ హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు హాజరవుతున్నారనే జగన్ హాజరు కాలేదని అంతా భావించారు. రాజ్ భవన్‌కు మాత్రం ఇద్దరు నేతలూ హాజరయ్యారు. అయితే హైకోర్టు సీజే సహా అనేక మంది ప్రముఖులు హాజరు కావడంతో వ్యక్తిగతంగా మాట్లాడుకునే సందర్భం ఎదురు కాలేదు. పలకరింపులకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది.