ఈమధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబలి నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలే. పుష్ప, కేజీఎఫ్‌లూ బాహుబలిని అనుసరించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది. బింబిసార పార్ట్ 2 కు సమాయాత్తం అవ్వబోతోంది. ఈ లిస్టులో ఇప్పుడు `ప్రాజెక్ట్ కె` కూడా చేరబోతోందని సమాచారం.
ప్రభాస్ – నాగ అశ్విన్‌ల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా రూపొందించబోతున్నారని టాక్. కథాపరంగా ఈ సినిమా స్పాన్ ఎక్కువ. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి.. ఎన్ని భాగాలైనా తీసుకోవొచ్చు. పార్ట్ 2కి సంబంధించిన బీజం… `ప్రాజెక్ట్ కె` పతాక సన్నివేశాల్లో కనిపించబోతోందని తెలుస్తోంది. `ప్రాజెక్ట్ కె` కథలో కొన్ని లింకులకు, కొన్ని ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లో తెలుస్తుందని ఇవే పాత్రలు, ఇదే నేపథ్యం కొనసాగినా, కొనసాగకపోయినా.. ఈ కథకు మాత్రం రెండో భాగం తప్పకుండా ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. అదే జరిగితే… పార్ట్ 2 పరంపరలో ప్రభాస్ చేస్తున్న మూడో సినిమా ఇదే అవుతుంది.