సినిమా విడుదల అయ్యాక, రిజల్ట్ ని బట్టి దర్శకుడి చేతిలో అడ్వాన్సులు పెట్టడం సర్వ సాధారణమైన సంగతే. ఏ సినిమా హిట్టవుతుందా? అని నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుదలకు ముందే ఆ విషయాన్ని పసిగట్టి, దర్శకుల్ని లాక్ చేసుకోవడంలోనే నిర్మాత తెలివితేటలు, ముందు చూపూ దాగుంటాయి. ఈ విషయంలో గీతా ఆర్ట్స్ ఆరితేరిపోయింది. ఈమధ్య గీతా ఆర్ట్స్ ఇద్దరు దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చింది.. ఒకరు మల్లిడి వేణు (బింబిసార), మరోకరు… చందూ మొండేటి (కార్తికేయ 2).
బింబిసార హిట్టవ్వడంతో మల్లిడి వేణు (వశిష్ట్)పై దృష్టి పడింది. చాలామంది నిర్మాతలు ఇప్పుడు వశిష్ట్ కి అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే బింబిసార విడుదలకు ముందే వశిష్ట్ గీతా ఆర్ట్స్‌లో అడ్వాన్సు పుచ్చుకొన్నాడు. బింబిసార 2 అయ్యాక.. వశిష్ట్ చేయాల్సింది గీతా ఆర్ట్స్ లోనే. ‘సవ్యసాచి’ తరవాత చందూని ఎవ్వరూ నమ్మలేదు. మరో సినిమా అందుకోవడానికి చందూ చాలా కష్టపడాల్సివచ్చింది. చివరికి.. ‘కార్తికేయ 2’ వచ్చింది. ఈ సినిమా హిట్టవ్వడంతో చందూ పేరు మరోసారి మార్మోగిపోతోంది. అయితే.. ‘కార్తికేయ 2’ జరుగుతుండగానే గీతా ఆర్ట్స్ చందూ చేతిలో అడ్వాన్స్ పెట్టేసింది. కార్తికేయ 3 కంటే ముందు… గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి చందూ. ఈసారి చందూకి పెద్ద హీరో ఇస్తానని గీతా ఆర్ట్స్ మాట ఇచ్చింది. సో.. భారీ కాంబోలోనే చందూ మొండేటి సినిమా రాబోతోందన్నమాట. వారం రోజుల వ్యవధిలో టాలీవుడ్ లో రెండు హిట్లు పడ్డాయి. ఆ రెండు హిట్లు ఇచ్చిన దర్శకులు గీతా ఆర్ట్స్ లో పడ్డారు. మొత్తానికి ఇద్దరు హిట్ డైరెక్టర్లని గీతా ఆర్ట్స్ భలేగా పట్టేసింది.