గత వారం విడుదలైన ‘కార్తికేయ 2’ మంచి విజయాన్ని అందుకొంది. నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ ముందే సైడ్ అయిపోవడంతో.. ‘కార్తికేయ 2’కు ఛాన్స్ లభించింది. ఈ సినిమాకి రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈవారం ఏకంగా 7 సినిమాలొస్తున్నాయి. కాకపోతే… దేనికీ సరైన క్రేజ్ లేదు. తీస్ మాస్ ఖాన్, బుజ్జీ ఇలా రా, పండుగాడ్, డై హార్డ్ ఫ్యాన్, కమిట్మెంట్, సుభద్ర… ఇలా అన్నీ చిన్నా చితకా చిత్రాలే. వీటిలో కాస్తలో కాస్త తీస్ మాస్ ఖాన్, పండుగాడ్ మాత్రమే కొంచెం పబ్లిసిటీ చేసుకొంటున్నాయి. మిగిలిన చిత్రాల అలికిడి లేదు. వచ్చేవారం ‘లైగర్’ ఉంది. విజయ్ దేవరకొండ – పూరిల క్రేజీ కాంబోలో రూపొందిన సినిమా ఇది. అది పాన్ ఇండియా స్థాయి చిత్రం. ఆ సినిమా వస్తే… థియేటర్లన్నీ ఖాళీ చేసేయాలి.
కాబట్టి.. ఈవారం మీడియం రేంజు సినిమాలు రావడానికి ధైర్యం చేయలేదు. సో…. ఈ వారం కూడా ‘కార్తికేయ 2’కి మంచి ఛాన్సు దొరికినట్టైంది. దాంతో పాటు సీతారామం, బింబిసార సినిమాలకూ స్కోప్ దొరికింది. వీటి దూకుడు ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ లో పడిపోయి, లాభాల బాట పట్టేశాయి. ఈ వారం ఎంతొచ్చినా వాటికి బోనసే. మంచి సినిమా వస్తే, అన్నీ కలిసొచ్చేస్తాయ్ అంటారు. అలా ఈ మూడు సినిమాలకూ బాక్సాఫీసు దగ్గర మంచి స్పేస్ దొరికింది.