రూ. లక్ష కోట్ల ప్రాజెక్ట్ కాళేశ్వరంలో అత్యంత నాసిరకం పనులను మేఘా కంపెనీ చేపట్టినట్లుగా వచ్చిన ఒక్క వరదతో తేలిపోయింది. మునిగిపోయిన పంప్ హౌస్‌ల వద్దకు ఎవరినీ పోనివ్వడం లేదు. వందల మంది పోలీసుల్ని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ డీ వాటరింగ్.. ఇతర పనులను మహారాష్ట్ర నుంచి కూలీల్ని తెప్పించి పని చేయిస్తున్నారు. కానీ లోపల జరిగిన నష్టం గురించి మాత్రం వివరాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కన్నెపల్లి పంప్ హౌస్ బాహుబలి మోటార్లు ఎందుకూ పనికి రాకుండా పోయినట్లుగా తెలుస్తోంది.
నీళ్లలో మునిగి మోటార్లు పాడైపోలేదు. నాసిరకం నిర్మాణాల వల్లే సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ ఫోర్ బేసిమెంట్ గోడ కూలి మోటార్లపైనే పడింది. దీంతో మొత్తం పదిహేడు మోటార్లలో ఎనిమిది పూర్తిగా ధ్వంసమయ్యాయి. పంప్‌హౌస్‌లో అమర్చిన మూడు భారీ క్రేన్లు, లిఫ్ట్ సైతం మోటార్లపైనే పడడంతో అన్నీ పక్కకు జరిగిపోయాయి. దీంతో మిగతావీ రిపేరుకు వచ్చాయి. ఇలా అన్ని రకాలుగా నాసిరకంగా పనుల వల్ల కనీసం రూ. వెయ్యి కోట్ల నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. మళ్లీ మోటార్లను కొనుగోలు చేసేదాకా.. ఉన్న వాటిని బాగు చేసేదాకా నీళ్లను ఎత్తిపోయడం కష్టం. ఈ పనులకు ఏడాదికిపైగానే పడుతుందన్న అంచనా ఉంది.
ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రభుత్వం, మేఘా కాంట్రాక్ట్ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఫొటోలు, వీడియోలు లీక్ కాకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఇవాళ కాకపోతే.. రేపైనా అసలు విషయం బయటపడాల్సిందే.కానీ ఇప్పుడు ఆ నష్టం ఎవరు భరిస్తారన్నది కీలకంగా మారింది. వరద పరిస్థితుల వల్ల ఇన్సూరెన్స్ కూడా రాదని చెబుతున్నారు. అయితే మేఘా భరించాలి..లేకపోతే ప్రభుత్వం భరించాలి. ఎవరికైనా భారమే. ప్రభుత్వమే మళ్లీ భరిస్తే.. ఇప్పటికే వస్తున్న విమర్శలకు తోడు మరిన్ని భరించాల్సి ఉంటుంది.