బీజేపీలో మరో ఇద్దరు సీనియర్లకు పొగ పెట్టేశారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్లను బీజేపీ అత్యున్నత కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. ఇక పార్లమెంటరీ బోర్డులో మిగిలిన సీనియర్ ఒకే ఒక్కరు.. రాజ్ నాథ్ సింగ్. ఆయన కాకుండా ఉన్నది అమిత్ షా, మోదీ మాత్రమే. ఇక అధ్యక్షుడిగా ఉన్నందుకు జేపీ నడ్డా ఉంటారు. మిగిలిన వారంతా.. మోదీ, అమిత్ షా ప్రాపకంతో పైకొచ్చినవారే. వారంతా తలూపడానికే ఉంటారు. ఇటీవలే రాజ్యసభ టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేసిన లక్ష్మణ్‌కు కూడా చోటిచ్చారు.
కానీ గడ్కరీ , చౌహాలను మాత్రం పక్కన పెట్టేశారు. అద్వానీ, వాజ్ పేయి హయాంలో కీలకమైన నేతలందర్నీ దాదాపుగా సైడ్ చేసేశారు. ఇక చివరి విడతగా రాజ్ నాథ్ సింగ్ మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మోడీ, షాలు మాత్రం మిగులుతారు. బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన నేతలకు చోటు లేదని చెబుతూ ఉంటారు. అయితే ఆ నిబంధన మోదీ, అమిత్ షాలకు వర్తిస్తుదో లేదో స్పష్టత లేదు. అదే్ సమయంలో ఎన్నికల కమిటీని కూడా పునర్ వ్యవస్థీకరించారు. ఇందులోనూ ఆ సీనియర్లకు చోటు దక్కలేదు.
ఎన్నికల కమిటీ ఎప్పుడు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలోనూ తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ లక్ష్మణ్‌కు చోటిచ్చారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు మాత్రం చోటు దక్కలేదు. ముఖ్యమంత్రి పదవుల నుంచి తప్పించిన యడ్యూరప్ప, షర్బానంద సోనోవాల్ వంటి నేతలకు చోటిచ్చారు. బీజేపీలో ఎప్పటికప్పుడు కొంత మంది సీనియర్లను పక్కన పెడుతూ ఉంటారు. ఆ ప్రకారం ఇప్పుడు నితిన్ గడ్కరీ, చౌహాన్ వంతు వచ్చిందేమోనన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.