టీడీపీ చేసిన ఆరోపణలను అడ్డం పెట్టుకుని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ తనకు గన్మెన్లను తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి ఆయన ఇదే అంశంపై తెలంగాణ పోలీసుల్ని సంప్రదించారు.హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించాలని హైకోర్టు తెలంగాణ పోలీసులకు సూచించింది. దీంతో మరోసారి ఆయన పోలీసుల్ని సంప్రదించారు. తనకు పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన చెబుతున్నారు.
టీడీపీ నేత పట్టాభి తన ఫోన్ నెంబర్ను చెప్పిన తర్వాత మరింత కాల్స్ ఎక్కువయ్యాయని.. అయితే ఎక్కువ బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి వస్తున్నాయన్నారు. హిట్మ్యాన్ అనేయాప్లో తనను చంపడానికి సుపారీ ఇచ్చామని బెదిరిస్తున్నారని ఆయన అంటున్నారు. అయితే చికోటి ప్రవీణ్ ఎలాగైనా గన్మెన్ల రక్షణ పొందాలన్న పట్టుదలగా ఉన్నారు. గతంలో గోవాలోనూ ఓ కేసినోలో వివాదం చెలరేగితే.. అదే కారణం చూపించి కొన్నాళ్ల పాటు గన్మెన్లను పొందారు. ఇప్పుడుకూడా అదే ట్రిక్ ప్లే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే చికోటి ప్రవీణ్ లాంటి కేసినో కింగ్లకు రక్షణ కల్పిస్తే.. వారు చేసే వ్యవహారాలకు మద్దతు ఇచ్చినట్లవుతుందని.. ఆ గన్మెన్లను చూపించి ఆయన మరింతగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడన్న అభిప్రాయం పోలీసుల్లో ఉంది. నిజంగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటే సెక్యూరిటీ కల్పించవచ్చు కానీ.. చీకోటి ప్రవీణ్.. సెక్యూరిటీ కోసమే..ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.