రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని చివరి క్షణంలో ఆరోగ్య కారణాలతో విరమించుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బీజేపీ బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లుగా తమిళనాట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి రజనీ కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఆయనను దక్షిణాదిలోనే ఓ కీలకమైన రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే చాన్స్ ఉందని చెబుతున్నారు.
దక్షిణాదిన పార్లమెంట్ సీట్లు పెంచుకోవడం ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారింది. హిందీ రాష్ట్రాల్లో ప్రతీ సారి వందకు వంద సీట్లు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అక్కడ కోత పడే సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలి. ఈ క్రమంలో తమిళనాడులో రజనీకాంత్ కోసం గతంలో ప్రయత్నించి విఫలమయింది. ఆయన అసలు రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అభిమానుల్ని ఆకట్టుకుని రాజకీయంగా ఎదగాలని బీజేపీ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
రాజ్యాంగపరంగా గవర్నరే ప్రభుత్వాధినేత. ముఖ్యమంత్రి కాకపోయినా… ముఖ్యమంత్రి కన్నా పై పొజిషన్ సాంకేతికంగా అయినా వెళ్లవచ్చని ఆయనకు బీజేపీ చెబుతోంది. కొద్ది రోజుల కిందట… తమిళనాడు గవర్నర్ ను రజనీకాంత్ ను కలిసినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించారు. ఏమీ లేకపోతే ఎందుకు కలుస్తారని చెప్పుకున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా… రజనీకి గవర్నర్ ఆఫర్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎప్పట్లాగే ప్రచారంతో ఆగిపోతుందా… నిజంగానే ఆయన గవర్నర్ అవుతారా అన్నది వేచి చూడాల్సిందే