‘సీతారామం’తో… ఓ సూపర్ సక్సెస్ కొట్టాడు హను రాఘవపూడి. ఈ విజువల్ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. ఇది వరకు కూడా హనుకి హిట్లు ఉన్నాయి. కానీ… ఇంత గౌరవం ఎప్పుడూ రాలేదు. హను రాత, తీత..ని ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు హను తరవాత ఎలాంటి సినిమా తీస్తాడు? అనే ఉత్కంఠత ందరిలోనూ నెలకొంది. మైత్రీ మూవీస్ లో హను ఓ సినిమా చేయబోతున్నాడు. ‘సీతారామం’ తరవాత హను చేయబోయే ప్రాజెక్టు మైత్రీ లోనే. కథ రెడీ అయిపోయింది. హీరో దొరకడమే తరువాయి.
అయితే ఈసారి హను జోనర్ మార్చాడు.తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీని కాకుండా హిస్టారికల్ ఫిక్షన్ చేయబోతున్నాడు. కథ పిరియాడిక్ జోనర్లో సాగబోతోంది. సెట్స్‌కి, విజువల్ ఎఫెక్ట్స్‌కీ ఈసారి చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కథలోనూ తన మార్క్ లవ్ ట్రాక్ ఉండాలని చూస్తున్నాడు హను. అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే హను సినిమా అనేసరికి లవ్ ట్రాకులు బాగుంటాయని పేరొచ్చేసింది. ‘పడి పడి లేచె మనసు’ ఫ్లాప్ అయినా సరే, అందులో లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే.. ఈసారి కూడా లవ్ ట్రాక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడని సమాచారం.