‘బింబిసార’ తరవాత పార్ట్ 2 వస్తుందని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. కానీ ఎవరికీ నమ్మకాల్లేవు. ‘ముందు బింబిసార 1 హిట్టవ్వాలి కదా..’ అనుకొన్నారు. తీరా చూస్తే `బింబిసార` సూపర్ హిట్టయ్యిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ పార్ట్ 2పై పడింది. `బింబిసార` ఇచ్చిన ఉత్సాహంతో పార్ట్ 2ని ఇంకాస్త గ్రాండ్ గా తీయాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులోకి దిల్ రాజు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలొస్తున్నాయి. కాబట్టి బడ్జెట్ విషయంలో ఆలోచించుకోవాల్సిన పని లేదు. దర్శకుడు వశిష్ట్ ఇప్పుడు పార్ట్ 2 కథ కోసం కసరత్తులు మొదలెట్టేసినట్టు టాక్.
కల్యాణ్ రామ్ కూడా `బింబిసార 2` కి టైమ్ లైన్ కూడా ఫిక్స్ చేశాడు. నవంబరులో ఈ సినిమా మొదలెట్టి.. 2024 ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నాడు. పార్ట్ 2 కథ ఇంకా లాక్ అవ్వలేదు. సెప్టెంబరు, అక్టోబరు నాటికి స్క్రిప్టు పనులు పూర్తవుతాయి. ఏప్రిల్, మేలలో షూటింగ్ పార్ట్ అవ్వగొట్టి, పోస్ట్ ప్రొడక్షన్‌కి కావల్సినంత సమయాన్ని చేతిలో ఉంచుకోవాలని భావిస్తున్నారు. `బింబిసార` చనిపోవడంతో పార్ట్ 1 పూర్తయ్యింది. తనని బతికించి, మళ్లీ త్రిగడ్తల సామ్రాజ్యంలోకి తీసుకెళ్లడంతో పార్ట్ 2 మొదలవుతుందని, బింబిసారుడు అలా ఎందుకు తయారయ్యాడు? తమ్ముడితో తన వైరనం ఏమిటి? అనే విషయాలు బింబిసార 2లో తెలుస్తాయని సమాచారం. మాయా దర్పణంలో బింబిసార పడిపోయి.. మళ్లీ మరోకాలానికి వెళ్లడం పార్ట్ 2లో చూడబోతున్నాం. ఈసారి బింబిసార తో కొత్త లోకాన్ని సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.