నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి వారంతా సహకరించారో అప్పుడే అందరికీ కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఆ విషయం తర్వాతి కాలంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడయ్యాక తెలియడం ప్రారంభమైంది. మొదట రథయాత్రతో బీజేపీకి ఊపిరిలూదిన అద్వానీ దగ్గర్నుంచి .. ఒక్కొక్కర్ని పంపేశారు. చివరికి వెంకయ్యనాయుడు కూడా ఇప్పుడు కొన్ని పొగడ్తలతో సరిపెట్టుకుని సైడైపోయారు.
వీరందర్నీ పక్కన పెట్టడానికి మోదీ, షా 75 ఏళ్ల వరకే పదవులు అనే సూత్రాన్ని అడ్డం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అది మోదీకే అడ్డం వస్తోంది. అందుకే కొత్త ప్లన్లు అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తే మోదీనే ప్రధాని. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో వందకు వంద శాతం సీట్లు సాధిస్తేనే అలా వస్తుంది. గత రెండు సార్లు అదే జరిగింది. మూడో సారి కూడా అదే జరుగుతుందని సర్వేలు రెండేళ్ల ముందు నుంచే ప్రచురిస్తున్నారు. అయితే ప్రతీ సారి అద్భుతాలు జరగవన్న వాదన వినిపిస్తోంది. ఒక వేళ ఇతర పార్టీలపై ప్రభుత్వ ఏర్పాటుకు ఆధారాపడాల్సి వస్తే .. మోదీ ప్రధానిగా అంగీకరించరు. అప్పుడు బీజేపీలోనే ప్రత్యామ్నాయం కావాలి. అప్పుడు మొదటి చాయిస్గా ఉండేది నితిన్ గడ్కరీ.
ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేశారు. సమర్థవంతమైన నేతగా పేరుంది. అంతకు మించి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. మోదీ, గడ్కరీల్లో ఎవరుంటే మద్దతిస్తారంటే ఇతర పార్టీలు ఖచ్చితంగా గడ్కరీనే కోరుకుంటాయి.ఎందుకంటే మోడీ ఎంత ప్రమాదకారినో గత ఎనిమిదేళ్లుగా చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తే.. గడ్కరీని రేసులోకి లేకుండా చేయడానికే ఆయనను పక్కన పెడుతున్నారన్న వాదన ఢిల్లీ బీజేపీలో వినిపిస్తోంది.
ఇక రాజ్ నాథ్ ఒక్కరే గతంలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన సీనియర్ నేత. ఆయనను కూడా సాగనంపితే సమస్య పరిష్కారమవుతుందని .. మోదీకి తిరుగుండదని అనుకుంటున్నారు. నిజానికి మోదీకి వచ్చే ఎన్నికల నాటికి 75 ఏళ్లు వస్తాయి. ఎన్నికల్లో గెలిచినా… పదవి చేపట్టకూడదు. కానీ రాజకీయంలో రూల్స్ అధికారం చేతుల్లో ఉన్న వారికి వర్తించవు. అది అధికార పార్టీలో అయినా సరే.. అందుకే మోదీ పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు.