సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో ప్రారంభిస్తామని చెప్పి కుప్పం నుంచి ప్రారంభించారు. అటు శివారులో ఉన్న కుప్పం..ఇటు శివారులో ఉన్న రాజాం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అంతే మళ్లీ నియోజకవర్గాల సమీక్ష ఊసే లేకుండా పోయింది . అధికారంలోకి వచ్చాక జగన్తో కలిసే చాన్స్ రాలేదని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి కార్యక్తల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ చాన్స్ ఇస్తున్నట్లుగా ఊరించి…. లైట్ తీసుకుంటున్నారు.
నియోజకవర్గాల నుంచి యాబై మంది కార్యకర్తలు వస్తున్నారు కానీ.. వారు టీ, కాఫీలు తాగి జగన్ చెప్పేది విని వెళ్లడం తప్ప.. అభిప్రాయాలు చెప్పే అవకాశం రావడం లేదు. ప్రజలు నిలదీస్తున్న వైనం గురించి చెబితే ఎక్కడ హైలెట్ అవుతుందోనని వారిని నియంత్రిస్తున్నారు. మనం 175 సీట్లు గెలుచుకుందామని జగన్ చెబుతున్నారు కానీ.. సమీక్షలకు వస్తున్న వారి మైండ్లో మాత్రం రోడ్లు.. పథకాలు మాత్రమే ఉంటున్నాయి . దాదాపుగా అందర్నీ స్థానిక ప్రజాప్రతినిధులనే ఎంపిక చేస్తున్నారు. ఈ కారణంగా వారు తమపై ప్రజలు చేస్తున్న ఒత్తిడిని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ప్రయోజనం లేకపోతోంది.
ఇప్పుడు రెండు నియోజకవర్గాలతోనే ఈ సమీక్షలు ఆగిపోవడం వైసీపీ నేతల్లోనూ నిరాశ వ్యక్తమవుతోంది. ఇంకా ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతీ రోజూ సమీక్ష చేసినా.. ఆరు నెలలు పడుతుంది. వారానికి మూడు నియోజకవర్గాలు చొప్పున సమీక్ష చేస్తే ఏడాది పైనే పడుతుంది. కానీ ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఇక సమీక్షల గురించి అవకాశమే ఉండదు. అందుకే.. ఇదంతా ఆర్భాటమైన ప్రకటనలేనని.. కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదని ఉసూరుమంటున్నారు.