ఎన్నికలకు ఎంతో దూరం లేదని క్యాడర్‌కు చెబుతున్న చంద్రబాబు టిక్కెట్లు కూడా ఖరారు చేస్తున్నారు. మీరే అభ్యర్థి అని చెప్పి.. ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహం పాటించాలో చెప్పి పంపిస్తున్నారు. నియోజకర్గాల ఇంచార్జీలతో నిర్వహిస్తున్న సమావేశాల్లో ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు. పలు నియోజకవర్గాలలో పని చేసుకుంటున్న అభ్యర్థులకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దాదాపుగా 140 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై చంద్రబాబు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఫ్పై నుంచి నలభై నియోజకవర్గాల్లో మాత్రం నేతలు చురుకుగా పని చేయడం లేదు.
అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పరిస్థితిపై అధ్యయనం చేయిస్తున్నారు. మిగిలిన చోట్ల మాత్రం చంద్రబాబు అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు. వారికి పిలిచి చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జగన్ వెళ్లే అవకాశం లేదని గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్తే ఆయనతో పాటు లేకపోతే.. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలతో పాటు జగన్ కూడా వెళ్తారని భావిస్తున్నారు.
అందుకే చంద్రబాబు పార్టీ నేతల్ని సమాయత్తం చేయిస్తున్నారు. జగన్ కూడా ముందస్తు సన్నాహాలను బహిరంగంగానే చేసుకుంటున్నారు. కానీ ముందస్తుకు వెళ్లమని చెబుతున్నారు. గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ ప్రతి జిల్లాకూ వెళ్లి ఓ పథకం మీట నొక్కుతున్నారు. చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఏపీలో ముందస్తు ఖాయమన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.