తెలంగాణలో క్షణం కరెంట్ పోదు..ఢిల్లీలో క్షణం కరెంట్ ఉండదంటూ బీజేపీ తీరుపై ఎద్దేవా చేసిన రెండు రోజుల్లోనే కేసీఆర్‌కు .. కేంద్రం షాకిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఎక్సేంజీల నుంచి కరెంట్ కొనకుండా నిషేధం విధించింది. ఇప్పటి వరకూ కొన్న వాటికి దాదాపుగా పదిహేను వందల కోట్లు కట్టాల్సి ఉండటంతో అవన్నీ కట్టిన తర్వాతే కరెంట్ కొనాలని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ సర్కార్‌లో ఒక్క సారిగా షివరింగ్ ప్రారంభమయింది. వెంటనే సీఎం కేసీఆర్ అత్యుతన్న సమావేశం నిర్వహించారు. కరెంట్ కోతల్లేకుండా ఏం చేయాలో చర్చించారు.
వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి .. కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరు వల్ల పీక్ అవర్స్‌లో కరెంట్ కోతలు విధించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ ఆందోళన చూస్తూంటే… కరెంట్ విషయంలో బుడగ పేలిపోతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ఎక్కువ కరెంట్ ఎక్సేంజీల నుంచి కొనుగోలు చేసి సర్దుబాటు చేస్తోంది. ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేదు. అలా కొనుగోలు చేస్తున్న వాటికీ డబ్బులు కట్టడం లేదు. ఇప్పటికిప్పుడు పదిహేను వందల కోట్లు కడితే తప్ప.. ఎక్సేంజీలలో కరెంట్ కొనడానికి చాన్స్ ఉండదు.
ఏపీకి కూడా ఇదే వర్తిస్తుంది. కానీ అక్కడ కరెంట్ సరిపోకకపోతే నిర్భయంగా కోతలు విధించేస్తారు. అంతే రుబాబుగా ఒక్క చోట కూడా కరెంట్ కోతల్లేవని చెబుతారు. కానీ తెలంగాణలో అలా చెప్పలేని పరిస్థితి. నిజంగానే ఈ సమస్యను పరిష్కరించుకోలేక.. తెలంగాణలో కరెంట్ కోతలు విధిస్తే.. కరెంట్ పుణ్యం అంతా కేంద్రానిదేనని నిరూపితమయిందని.. బీజేపీ లాంటి పార్టీలు విజృంభించడం ఖాయమని అనుకోవచ్చు.