మణిరత్నం ఓ దిగ్గజ దర్శకుడు. హిట్లు, ఫ్లాపులు ఎన్నయినా రానివ్వండి.. ఆయన మార్క్ ఆయనదే. ఎంత ఫ్లాప్ సినిమా అయినా… ‘మణి ఈ సీన్ భలే తీశాడ్రా..’ అనో ‘మణి ఈ షాట్ భలే పెట్టాడ్రా’ అనో అనిపిస్తుంది. అదీ ఆయన స్టైల్.. అదీ ఆయన ముద్ర. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలామంది కి ఉంటుంది. కానీ.. ఆ అవకాశం కొద్దిమందికే దక్కుతుంది. చిరంజీవి లాంటి మెగాస్టార్లకే ఆ ఛాన్స్ రాలేదు. అయితే ఇన్నేళ్లకు మణిరత్నం సినిమాలో ఆయన భాగం పంచుకొన్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం `పొన్నియన్ సెల్వన్`. కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్.. ఇలా బడా స్టార్ గణం ఉంది ఈ సినిమాలో. సెప్టెంబరు 30న వస్తోంది. ఈ సినిమాలో పరోక్షంగా చిరు పనిచేశారు. అదేమిటన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. చిరంజీవికి థ్యాంక్స్ చెప్పుకొన్నారు. ”చిరంజీవి గారికి థ్యాంక్స్. కానీ నేను ఆయనకు థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నానో ఇప్పుడే చెప్పను..” అని కాస్త సస్పెన్స్ లో పెట్టేశారు. బహుశా ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చు. అలాగైనా మణిరత్నం సినిమాలో చిరు భాగం పంచుకొన్నట్టే. ఈ సందర్భంగా.. మణిరత్నం రాజమౌళికి కూడా థ్యాంక్స్ చెప్పారు. రాజమౌళి వల్లే.. ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం వచ్చిందన్నారు మణిరత్నం. ఈ సినిమాని మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. తెలుగులోనూ బాగా పబ్లిసిటీ చేద్దామనుకుంటున్నారు. అందుకే చిరు, రాజమౌళిలను రంగంలోకి దించినట్టు ఉన్నారు.