Wanted PanduGod movie review telugu
తెలుగు360 రేటింగ్ :1/5
చదువుకోక ముందు కాకరకాయ్ అన్నవాడే.. చదువొచ్చాక.. కీకరకాయ్ – అన్నాడట.
పాత సామెతే. కానీ.. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సివస్తోంది.. వాంటెడ్ – పండుగాడ్ అనే సినిమా వల్ల. వంద సినిమాలు తీసిన అనుభవం రాఘవేంద్రరావు సొంతం. వేల సినిమాల్ని చూసుంటారు. ఏ సినిమా ఎందుకు ఆడుతుందో, ఎందుకు ఆడదో… సుదీర్ఘమైన వివరణ ఇవ్వగలరు. ఉదాహరణలతో సహా నిరూపించగలరు. అదీ ఆయన అనుభవం నేర్పిన పాఠం. అలాంటి దర్శకుడు నిర్మాతగా మారి ఓ కథ ఓకే చేశాడంటే.. కచ్చితంగా అందులో పాయింట్ ఉండాల్సిందే. ఇందులో మరో మాటకు తావు లేదు. ఆ సినిమా ఆడిందా, లేదా? అనేది పక్కన పెడితే, ఎత్తుకొన్న కథ.. విషయంలో మాత్రం ఆయన తప్పు చేయకూడదు. అలాంటి దిగ్గజ దర్శకుడి నిర్మాణంలో వచ్చింది… వాంటెడ్ పండుగాడ్. పోస్టరు మీద.. సునీల్, వెన్నెల కిషోర్. సప్తగిరి, అనసూయ, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం, ఫృథ్వీ… ఇలా పండించడంలో అరివీర భయంకరులున్నారు. కె.రాఘవేంద్రరావు అనే బ్రాండ్ ఇమేజ్ దానికి తోడైంది. మరి ఇది కాకరకాయా.. కీకర కాయా..? నేతి బీరకాయా..?
ఫస్ట్ సీన్లో సునీల్ ఎంట్రీ ఇస్తాడు. ఆయనే మన పండు. జైల్లోంచి వీర లెవిల్లో పారిపోతాడు.. పోతూ పోతూ నాలుగు పంచ్ డైలాగులు కూడా చెబుతాడు. ‘పండుగాడు పారిపోయాడు… వాడ్ని పట్టిచ్చిన వాళ్లకు కోటి రూపాయలు’ అని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అక్కడి నుంచి మన కథ మొదలవుతుంది. రకరకాల పాత్రలు ప్రవేశిస్తాయి. అందరి లక్ష్యం… కోటి రూపాయల బహుమతే. మరి వాళ్లలో పండుగాడు ఎవరికి చిక్కాడన్నది సినిమా.
ఈ సినిమాలో కథా లేదు.. కాకరకాయ్ లేదు. జస్ట్ చిన్న లైన్ అంతే. కామెడీ సినిమాలకు అదే చాలా ఎక్కువ అనుకుంటే ఏం చేయలేం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పారిపోతే అతన్ని పట్టుకోవడానికి రకరకాల మనుషులు చేసే ప్రయత్నం ఇది. ఈ కథకు వంద సినిమాలు తీసిన రాఘవేంద్రరావు పడిపోవడం – అసలైన వింత, విడ్డూరం. పండుగాడ్ని పట్టుకోవడానికి ముందు వెన్నెల కిషోర్ రంగంలోకి దిగుతాడు. తనకో పాట, లవ్ స్టోరీ. అలాగే సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డిలకు కూడా. పండుగాడ్ ని ఇంటర్వ్యూ చేయడానికి సుడిగాలి సుధీర్, డాన్ అవ్వాలన్న ధ్యేయంతో పృథ్వీ, సినిమా తీయాలన్న లక్ష్యంతో తనికెళ్ల భరణి.. ఇలా ఎవరి కారణాలు వాళ్లవి. సబ్ ట్రాకులు ఎక్కువైపోయి.. మెయిన్ ట్రాక్ ఎక్కడో షెడ్డుకి వెళ్లిపోయింది. సునీల్ గెస్ట్ ఎప్పీరియన్స్ లా.. సినిమా ప్రారంభంలో ఓసారి, ఇంట్రవెల్ కి ఓసారి, క్లైమాక్స్ లో ఓసారి కనిపిస్తాడంతే. అనసూయ చెట్టుచాటు నుంచి చూడడం.. సైడ్ అయిపోవడం.. ఇదే తంతు. టీవీల్లో జరిగే డిబేట్లు, టీవీ యాంకర్ల అతి.. ఇవి చూపించడానికే సగం సీన్లు ఖర్చు చేసేశారు. ఇలాంటి బిట్లు… జబర్దస్త్ లో వందసార్లు చూసీ.. చూసీ నవ్వేసుకొన్న ప్రేక్షకులకు… అవే సీన్లు వెండి తెరపై వస్తే బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది..? పేరడీలతో గారడీ చేస్తామంటే జనాలు చూసే రోజులు కావివి. వాటికి టీవీ ఛానళ్లలో వచ్చే కామెడీ పోగ్రాంలు చాలు. డబ్బులు పోసి మరీ టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అసలు థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడమే పెద్ద గగనం అనుకుంటున్న రోజుల్లో పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలని నమ్ముకోవడం, దానికి కె.రాఘవేంద్రరావు నిర్మాత కావడం.. మింగుడు పడని విషయాలు.
దర్శకుడికి ఓ విజన్ ఉన్నట్టు ఒక్కటంటే ఒక్క సీన్లోనూ అనిపించదు. ఖాళీగా ఉన్న కామెడీ ఆర్టిస్టుల్ని కెమెరా ముందుకు తీసుకొచ్చి.. మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోండి.. నేను షూట్ చేస్తా – అన్నట్టు సాగాయి ఆ సన్నివేశాలు. ప్రతీ సీన్లోనూ… ఓ పేరడీ డైలాగో, స్నూఫో కనిపిస్తుంది. అంటే… కొత్తగా సీన్లు రాసుకొనే దమ్ము, తెలివి తేటలూ లేవనే కదా. తనికెళ్ల భరణి – ఆమని ట్రాక్ అయితే.. మరింత పేలవంగా అనిపిస్తుంది. ఓ పులి… వాళ్లపై దాడి చేయడానికి వస్తుంటే, ఆమని అప్పటికప్పుడు మేకప్ చెరిపేసుకొని.. పులిని భయపెడితే, పులి పారిపోతుంది. ఆమనిని మేకప్ లేకుండా చూసిన భరణి… కళ్లు తిరిగి ఢామ్మని కిందపడిపోతాడు.. ఇంతకంటే జబర్దస్త్ స్కిట్లే నయం కదా..?
సన్నివేశంలో అంతో ఇంతో బలం ఉన్నప్పుడు నటీనటులు దాన్ని తమ అనుభవం మేరకు లాక్కొస్తారు. ఖాళీ కాగితాలో, పేలవమైన సీన్లో రాస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు.. ఓవర్ యాక్షన్ తప్ప. పండుగాడ్లో కూడా అదే జరిగింది. ప్రతీ ఫ్రేములోనూ… ఐదారుగురు కమెడియన్లు ఉంటారు. కానీ కామెడీ పండదు. ప్రతీ ఒక్కరూ పంచ్లేస్తారు. కానీ.. అది ఇదివరకెప్పుడో పంక్చర్లు అయిపోయిన పంచ్‌లు. ఇప్పుడు నవ్వమంటే ఎలా…? బ్రహ్మానందం లాంటి హాస్య నటుడు కూడా… వెర్రిమొహం వేసుకొని, పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం తప్ప ఏం చేయగలడు? అనసూయలో ఓ రకమైన గ్లామర్ ఉంటుంది. వయసు పైబడినా…. చూడబుద్దేస్తుంది. కానీ ఈ సినిమాలో ఆమె డాన్స్ చేస్తుంటే.. ఈ పాట ఎప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది.
స్క్రిప్టు ఎంత పేలవంగా ఉందో.. సాంకేతిక విషయాల్లోనూ సినిమా అంతే నాశిరకంగా ఉంది. సినిమాని తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలన్న తొందర అడుగడుగునా కనిపిస్తుంది. మండుడెండల్లో.. ‘అబ్బా.. అబ్బబ్బా..’ అనే వాన సాంగు వేసుకోవడం నిర్మాణ చతురతకు మరో నిలువుటద్దం. హెలీకాఫ్టర్ల కూంబింగ్ షాట్స్‌ని పాత సినిమాల్లోంచి లాగేయడం… మరో గొప్ప ఉదాహరణగా చెప్పుకోక తప్పదు.
ఈ సినిమాలో ఓ సీన్ ఉంది. తనికెళ్ల భరణి ఓ డైరెక్టరు. తాను రాసిన స్క్రిప్టుని ఆమని చింపేస్తుంది.
శ్రీధర్ సిపాన రాసిన స్క్రిప్టు విషయంలోనూ ఇదే జరిగితే… ప్రేక్షకులకు ఈ శిరోభారం తగ్గేది. రాఘవేంద్రరావుకి డబ్బులూ మిగిలేవి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే… ”నా కథలో పెద్ద బొక్కుందో.. పెద్ద బొక్కే నా కథో తెలియడం లేదు..” ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి డైలాగ్ గుర్తొస్తుంది. ఈ కథ కూడా అక్షరాలా అంతే.
ఫినిషింగ్ టచ్: పండు కాదు.. పుచ్చు
తెలుగు360 రేటింగ్ :1/5