తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జగన్ చెక్ పెట్టేశారు. ఆమెను చాలా రోజులుగా దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండకో అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు. సాధారణంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే సమన్వయకర్తలు. ఇతరులను నియమించరు. కానీ తాడికొండలో మాత్రం సీన్ మారిపోయింది. ఉండవల్లి శ్రీదేవి అవసరం ఇక వైసీపీకి లేదని భావించడంతో డొక్కాకు బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది.
వివాదాస్పద ప్రవర్తన ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ హైకమాండ్‌కు విముఖత పెరిగేలా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె పార్టీ చేయమన్నట్లుగా చేశారు. రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తమకు రాజధాని అవసరం లేదన్నారు. సొంత నియోజకవర్గంలోని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. భూములన్నీ ఓ సామాజికవర్గానివే అన్నారు. చివరికి తమ పార్టీలో వర్గ పోరాటాల్ని కూడా టీడీపీకి అంటగట్టి కుల గొడవలు రేపారు. అయితే ఎన్ని చేసినా సొంత పార్టీలో ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు.
ఆమెపై తరచూ వివాదాలు వచ్చాయి. డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని పలువురు నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇస్తే నిండా మునిగిపోతామని భావించి జగన్ జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. డొక్కా మాణిక్యవరప్రసాద్ గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరి ప్రత్తిపాడు నుంచిపోటీ చేశారు. ఓడిపోవడంతో…. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీకి.. ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. అయితే విచిత్రంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలో చేరి తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికే వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి సీటుకే ఎసరు పెట్టారు.