వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి .. వైఎస్ హయాంలో కీలక నేత. ప్రస్తుతం ఎమ్మెల్యే అయినా ఆయనకు ఎక్కడా ప్రాధాన్యం లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి రాక ముందు కూడా ఆయన కీలక నేత. విప్లవ ఉద్యమ నేపధ్యం ఉన్న ఆయనకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. రామోజీరావు దగ్గరకు ఓ సారి జగన్‌ను కూడా తీసుకెళ్లారు. సీజేఐ కూడా భూమన తనకు ఆత్మీయుడని చెబుతున్నారు. ఆయనతో పుస్తకాన్ని ఆవిష్కరింప చేశారు.
ఈ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు.. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా భూమన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జగన్‌ను టార్గెట్ చేసినట్లుగా భూమన మాట్లాడారు. అదే సమయంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా తన దారిలోనే వెళ్తున్నారని సీజేఐ సానుభూతి చూపించారు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ నిజంగానే దూరం పెడుతున్నారు. అందుకే ఆయన రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఆయితే భూమన అభినయ్‌కు డిప్యూటీ మేయర్ పదవే ఇవ్వలేదు. రెండో డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారు. అయితే భూమన ఎమ్మెల్యే కావడంతో పెత్తనం ఆయనే చేస్తున్నారు. ఒకప్పుడు పార్టీలో తిరుగులేని ప్రాధాన్యత దక్కించుకున్న భూమన ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో తనకు ఇక ప్రాధాన్యం దక్కదనే భూమన ఇలా మాట్లాడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.