ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంతో బీజేపీ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా స్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది. సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు మాత్రమే కాకుండా అంతర్గతంగా చేసిన పలు ఆరోపణల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయంపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఇది ప్రాథమిక ఎఫ్ఐఆర్ మాత్రమేనని.. ముందు ముందు చాలా మంది కొత్తగా నిందితులు చేరుతారని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.
ఢిల్లీ బీజేపీ ఎంపీ సర్వేశ్ శర్మ తెలంగాణ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. తెలంగాణకు చెందిన అరబిందో ఇండస్ట్రీస్ కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి పేరు లిక్కర్ స్కాంలో వినిపిస్తోంది. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడుగా చెబుతున్నారు. మరో వైపు లిక్కర్ వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న మాగుంట పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కంపెనీలు మూడు చోట్ల సిండికేట్లను దక్కించుకున్నాయి. ఇందు కోసం రూ. కోట్లను మడుపులుగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టనుంది.
అయితే సీబీఐ ఈ అంశాలన్నీ పైపైన వెల్లడించింది. కారణం ఏదైనా కానీ.. మిగిలిన వారి పేర్లను మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేలా చేస్తోంది. ఈ కారణంగా అరబిందో శరత్ చంద్రారెడ్డి తోపాటు మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. అసలు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా.. హైదరాబాద్ వచ్చి.. డీల్స్ చేసుకున్నారని.. ఇదంతా టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో జరిగిందని బీజేపీ అంటోంది. అంటే.. కొంత మంది టీఆర్ఎస్ నేతలూ ఇరుక్కున్నట్లే. మొత్తానికి ఈ కేసు ముందు కు సాగే కొద్దీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.