ఈరోజుల్లో అన్నీ మూడు రోజుల సినిమాలే. ఆ మూడు రోజులూ గట్టిగా వసూళ్లొస్తే… సినిమా గట్టెక్కేసినట్టే. సినిమా అటూ ఇటూ అయ్యిందా? తొలి రోజే ఎత్తేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఓ సినిమా మూడు వారాల పాటు సాగిందంటే విశేషమే. ఆగస్టు 5న విడుదలైన ‘సీతారామం’ ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఈ సినిమా మూడో వారంలోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో ఇప్పుడు కూడా `సీతారామం` హవా కొనసాగుతోంది. శుక్రవారం గాజువాక లాంటి సెంటర్లో అన్ని షోలూ హౌస్ ఫుల్స్ తో నడిచాయి. హైదరాబాద్లోని మెయిన్ థియేటర్లో… ఇప్పటికీ టికెట్లు దొరకడం లేదు. అందులో అమ్మాయిల వాటానే ఎక్కువ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు ఈమధ్య రావడం లేదు. ‘సీతారామం’తో విడుదలైన బింబిసార పూర్తిగా మాస్ సినిమా. కాబట్టి… కుటుంబ ప్రేక్షకులు ఇప్పటికీ `సీతారామం`వైపే మొగ్గుచూపిస్తున్నారు. రూ.45 కోట్ల బడ్జెట్తో రూపొందించిన చిత్రమిది. దుల్కర్ – హను రాఘవపూడిలపై రూ.45 కోట్లు పెట్టి సినిమా ఎలా తీశారు? అంత రిస్క్ ఎందుకు? అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకొని రూ.60 కోట్ల వరకూ వసూలు చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఫైనల్ గా నిర్మాతకు రూ.15 కోట్లు లాభమన్నమాట.