ఏపీ ప్రభుత్వం సామాజికవర్గాలను రాజకీయంగా ఎలా వాడుకోవాలో.. కుల రాజకీయం ఎలా చేయాలో పీహెచ్డీ చేసినట్లుగా ఉంది. ఇది తప్పు.. ఒప్పు అనే ఆలోచన లేకుండా చేస్తూనే వెళ్తోంది. ఇటీవల ఓ కులానికి మాత్రమే నాలుగు పదాలతో కింద పర్చకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. మరి మిగతా వారిని అనొచ్చా అన్న విమర్శలను పట్టించుకోలేదు. తాజగా మున్నూరు కాపులను బీసీ-డీ కేటగిరి కిందకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇది ఏపీ మొత్తం వర్తించదు. కేవలం పోలవరం విలీన మండలాల వరకే వర్తిస్తుంది.
తూర్పు గోదావరి జిల్లాలోని చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు పశ్చిమ గోదావరం జిల్లాలోని కుకునూరు, వేలూరు పాడు, బూర్గంపాడు మండలాల్లోని మున్నూరుకాపు కులాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది ప్రభుత్వం..మున్నూరుకాపు కులస్తులకు బిసి-డి కింద కులదృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కాపులను బీసీల్లో చేర్చలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. గత ప్రభుత్వం అసెంబ్బీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం ఆమోదించలేదు . దీంతో కేంద్రం చేసిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభించారు.
కానీ జగన్ సీఎం అయిన తర్వాత వాటిని నిలిపివేశారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలోనే కాపులకు రిజర్వేషన్ లేకుండా పోయింది. అయితే గతంలో రిజర్వేషన్ కోసం ఉద్యమం చేసిన ముద్రగడ లాంటి వారు సైలెంట్ కావడంతో ఉద్యమ జరగడం లేదు. అయితే విలీన మండలాల్లో ఉన్న మున్నూరుకాపులను మాత్రమే బీసీడీలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఇతర ప్రాంతాల్లో కాపు వర్గీయులు ఆగ్రహం చెందే అవకాశం ఉంది. ఇలాంటిచర్యల వల్ల కులాల్లో చీలికలు వస్తాయని… ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది ఇదేనన్న విమర్శలు వస్తున్నాయి.