మునుగోడులో నిర్వహించిన ప్రజాదీవెన సభలో అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నాయి. ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారికి బుజ్జగింపులు చేశారు. అంతా సర్దుబాటు అయిందని ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటిస్తారనుకున్నారు. అందుకే కూసుకుంట్ల బహిరంగసభ కోసం భారీగా ఖర్చు పెట్టుకున్నారు. ఏర్పాట్లు చేశారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ కూసుకుంట్ల పేరును కూడా ప్రస్తావించలేదు.
సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పుడే అభ్యర్థి ప్రకటన వల్ల అనేక సమస్యలు వస్తాయని భావించినట్లుగా తెలుస్తోంది. గతంలోలా పరిస్థితులు లేవని.. అసంతృప్తులు ఊరుకోరని..వారికి బీజేపీ గాలం వేస్తుందని కేసీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అభ్యర్థి అంశాన్ని పెండింగ్‌లో పెట్టారు. అదే సమయంలో టీఆర్ఎస్లో అభ్యర్థిత్వం బీసీకి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ .. ఇదే డిమాండ్‌ను వినిపించారు. టిక్కెట్‌ను బీసీకే ప్రకటించాలన్నారు. మరో నేత కర్నె ప్రభాకర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వారు. ఆయన కరోనా సోకిందని సభకు డుమ్మా కొట్టారు.
కొంత మంది సీనియర్ బీసీ నేతలు ఇలా మాట్లాడటంతో.. అభ్యర్థి విషయంలో మరోసారి పరిశీలన చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి.. ఇక ముందు ప్రకటించరని.. షెడ్యూల్ వచ్చినప్పుడు మాత్రమే క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ అభ్యర్థి విషయంలో బ్యాక్ ఫుట్ వేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.