ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పాత్ర ఉందని.. త్వరలోనే ఆ విషయం బయటకు రాబోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. బీజేపీ తరపున ఢిల్లీ లిక్కర్ స్కాంపై ప్రధానంగా ఠాకూరే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పాత్రపై ఆయన ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. బీజేపీ యువమోర్చా చేపట్టిన యువ సంఘర్షణ ర్యాలీ ముగింపు సభ విజయవాడలో జరిగింది. ఈ సభలో ప్రసంగించిన అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ పాలనపై మండిపడ్డారు.
ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయన్నారు. గంజాయి మాఫియాతో ఏపీలో యువత నిర్వీర్యం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్లు అవినీతిలో ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్నారని ఠాకూర్ దువిమర్శించారు. రూ.4లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి లేదని .. ఒక్క రాజధానికే డబ్బు లేనప్పుడు 3 రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. జగన్కు జీఎస్టీ కంటే జేఎస్టీ ట్యాక్స్పైనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. జగన్ లిక్కర్ కింగ్ మాత్రమే కాదు.. స్టిక్కర్ కింగ్ అని సెటైర్ వేశారు.
చంద్రబాబును కాదని యువకులంతా జగన్కు అండగా నిలిచి గెలిపిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. జగన్ను గెలిపించిన యువతే ఇప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే విధంగా జగన్ పాలన సాగుతోందని విమర్శించారు.
సాధారణంగా ఢిల్లీ నుంచే వచ్చే కేంద్ర మంత్రులు జగన్ విషయంలో సాఫ్ట్ గా ఉంటారు. కానీ అనురాగ్ ఠాకూర్ మాత్రం తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా ఏపీ ప్రభుత్వ పెద్దల లింక్ బయట పెట్టబోతున్నామని ప్రకటించి .. వైసీపీ వర్గాల్లో అలజడి రేపారు. అనురాగ్ ఠాకూర్ ధాటినే ఇతర బీజేపీ నేతలు కొనసాగిస్తే.. ఏపీ రాజకీయం పూర్తిగా మారిపోయినట్లే అనుకోవచ్చు.